డిసెంబర్ 31... రహదారులు రక్తసిక్తం .. రోడ్డు ప్రమాదాలతో మరణ మృదంగం
తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 31 మరణ మృదంగం మోగిస్తుంది. రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. వరుస రోడ్ ప్రమాదాలలో పలువురు కన్ను మూశారు. నూతన సవత్సరం కొత్త ఆశలతో అడుగు పెట్టాలనుకున్న ఎందరినో ఈ ఏడాది చివరి రోజు కడతేరిపోయేలా చేసింది. ఎన్నో కుటుంబాల్లో డిసెంబర్ 31 విషాదం నింపింది.

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..గ్రూప్ వన్ ఆడిట్ అధికారిణి మృతి
ఇక చివరి రోజు జరిగిన విషాద ఘటనలు చూస్తే కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇబ్రహీంపట్నం వద్ద ఆగి ఉన్న యాసిడ్ లారీని వెనకనుండి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న గ్రూప్ వన్ ఆడిట్ అధికారిణి అన్నదాత రాగ మంజీరపై యాసిడ్ పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఆమె మాత్రం బతకలేదు . యాసిడ్ పూర్తిగా ఒంటిమీద పండటంతో మంజీర మృతి చెందింది. విశాఖపట్నం పెందుర్తికి చెందిన రాగ మంజీర ఇబ్రహీంపట్నం డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు .

ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఇక హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న ఆటోను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇద్దరు విద్యార్థులు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంతో ఘటనాస్థలంలో బీభత్సకరమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా లారీ గుద్దటంతో ఆటో మూడు పల్టీలు కొట్టిందని స్థానికులు చెప్తున్నారు. చిన్నారుల ఆక్రందనలు, హాహాకారాలు అక్కడివారిని కలిచివేశాయి. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది.

కర్నూలులో రోడ్డు ప్రమాదం... విషాదం నింపిన డిసెంబర్ 31
ఇక కర్నూలు జిల్లాలోని డోన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఎన్‌హెచ్ 44పై రోడ్డు ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన టూరిస్ట్ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు అశ్విన్, ఆనంద్, రాహుల్, ఇవిన్, శృతి, శ్రీజ తీవ్రంగాగాయపడ్డారు. కేరళ నుండి హైదరాబాద్‌కు వెళుతుండగా డోన్ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థులు మహానందవాడి వైనాడ్ పాలిటెక్నిక్ కాలేజీకు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.