ఏపీ సీఎంకు ఢిల్లీ ముఖ్యమంత్రి అభినందనలు: దిశ బిల్లు కాపీ పంపాలని అభ్యర్ధన: స్పీకర్ కు సైతం లేఖ..!
ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన ప్రతిష్ఠాత్మక దిశ బిల్లు -2019 పైన ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ సినీ హీరో చిరంజీవి ఈ బిల్లు తీసుకురావటం పైన ముఖ్యమంత్రి జగన్ ను అభినందించారు. అదే విధంగా పలువురు సినీ ..రాజకీయ ప్రముఖులు సైతం ప్రశంసించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సైతం బిల్లుకు మద్దతు ప్రకటించింది. ఇక, ఇదే అంశం పైన ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. ఈ బిల్లును ప్రతిపాదించటం..ఆమోదించటం పైన ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఢిల్లీ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిని సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం చదివి వినిపించారు. బిల్లును ఆమోదించినందుకు సభలోని ప్రతీ సభ్యుడిని అభినందిస్తూ..బిల్లు కాపీ..పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు రాసిన లేఖలో అభ్యర్ధించింది.
నన్ను అవమానించేందుకే అసెంబ్లీ: ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు
దిశా కాపీ..బిల్లు వివరాలు పంచుకోండి...
ఏపీ ప్రభుత్వ ఈ నెల 11న కేబినెట్ లో ప్రతిపాదించిన దిశ చట్టం - 2019 బిల్లును.. ఈ నెల 13న శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని పైన ఇప్పటికే పలువురు ప్రముఖులు ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. తాజాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాసారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు పైన ఢిల్లీ ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసించింది. బిల్లు కాపీనీ ..పూర్తి వివరాలతో తమకూ పంపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కోరారు.

ముఖ్యమంత్రితో పాటుగా బిల్లు ఆమోదించిన ప్రతీ సభ్యుడికి అభినందనలు తెలుపుతూ శాసనసభా స్పీకర్ కు లేఖ రాసారు. ఈ విషయాన్ని సభలో స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. వారి అభ్యర్ధన మేరకు ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు కాపీ..శిక్ష అమలు తీరు అంశాలను వివరిస్తూ ఏపీ ప్రభుత్వంలోని హోం శాఖ నుండి ఢిల్లీ ప్రభుత్వానికి సమాచారం పంపాలని నిర్ణయించారు.
రాష్ట్రపతి ఆమోదించగానే చట్టంగా..
ఏపీ కేబినెట్..అసెంబ్లీ ఆమోదించిన దిశ చట్టం -2019 బిల్లులో ఒక భాగానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంది. ఏపీలో ఎవరైనా మహిళపై అత్యాచారం చేస్తే..నిర్ధారించే ఆధారాలు ఉంటే వారికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా ఏపీ ప్రభుత్వం కొత్తగా బిల్లును ఆమోదించింది. తొలి వారం రోజుల్లోనే పోలీసులు పూర్తి సమాచారం ..ఆధారాలు సేకరించాలి. అదే విధంగా రెండు వారాల్లోనే ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసి..శిక్ష విధించే విధంగా బిల్లులో ప్రతిపాదించారు. దీని కోసం మొత్తం 13 జిల్లాల్లోనూ ప్రత్యేకంగా పాస్ట్ ట్రాక్ కోర్టులు..పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటుగా డీఎస్పీ ర్యాంకు అధికారులతో ప్రత్యేక పోలీసు టీంలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది గవర్నర్ వద్దకు వెళ్లినట్లు సమాచారం. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఈ బిల్లు ఆమోదించటాన్ని ప్రశంసిస్తూ..బిల్లు వివరాలను పంపాలని కోరటంతో..దీని పైన దేశ వ్యాప్తంగా మరింత చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.