
అంబటిపై సీఐడీకి దేవినేని ఉమ ఫిర్యాదు-తన అకౌంట్ హ్యాక్ చేసి పవన్ పై పోస్టు పెట్టారంటూ...
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యర్దుల్ని దూషించేందుకు ఇన్నాళ్లూ సోషల్ మీడియాను వాడుకున్న పార్టీలు, నేతలు.. ఇప్పుడు ప్రత్యర్ధుల ఖాతాల్ని హ్యాక్ చేసి ఫేక్ ట్వీట్లు పెడుతున్నారు. ఇలాంటి ఓ ఘటనపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఇవాళ సీఐడీకి ఫిర్యాదు చేసారు.
తనపై తప్పుడు ట్వీట్ చేసిన మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ అధికారులకు మాజీ మంత్రి దేవినేని ఉమ ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలోనే ఆయన మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అసత్య ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐడీ కార్యాలయానికి వెళుతున్న దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ఒక్కరు మాత్రమే వెళ్లాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన ఒక్కరే ఫిర్యాదు కాపీతో లోపలికి వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చారు.

దేవినేని ఉమ తన ఫిర్యాదులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి తాను పెట్టకుండానే ట్వీట్ పెట్టినట్లుగా సృష్టించి దానికి మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారని, ట్వీట్ డిలీట్ చేశారని సీఐడీకి ఫిర్యాదు చేశారు.
తన అకౌంట్ హ్యాక్ చేసిన అంబటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన అంబటి రాంబాబు తన అకౌంట్ హ్యాక్ చెసి పెట్టిన ట్వీట్ స్క్రీన్ షాట్ కాపీని కూడా సీఐడీకి అందజేశారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. దేవినేని ఫిర్యాదుపై ఇప్పటివరకూ సీఐడీ అధికారులు స్పందించలేదు.