కొడాలి నానీకి దేవినేని ఉమా కౌంటర్ .. జగన్ కనుసన్నలలోనే పశువుల కంటే హీనంగా బూతుల మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు కి జరిగిన అవమానం నేపథ్యంలో టిడిపి నేతలు వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తూ పదేపదే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో కొడాలి నాని చంద్రబాబు సతీమణిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, సానుభూతి కోసం చంద్రబాబు భార్యను అడ్డం పెట్టుకున్నాడు అంటూ మరోమారు భువనేశ్వరి పేరు తీసి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేపదే కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ వరద బాధితుల ఆర్తనాదాలు.. అక్కడ అసెంబ్లీలో జగన్ కు పొగడ్తలు; భగ్గుమన్న చంద్రబాబు

కొడాలి నాని వ్యాఖ్యలపై భగ్గుమన్న దేవినేని ఉమా
భార్యని రోడ్డుమీదికి తెచ్చిన ఘనత చంద్రబాబుదే అని, రాజకీయ అవసరాల కోసం భార్యను రోడ్డు మీదకు తీసుకురావడం అన్యాయం అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించి, వరద బాధితుల పరామర్శకు వెళ్లి తనను, తన భార్యను అవమానించారని ఏడుస్తున్నాడని తీవ్ర పదజాలంతో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. కొడాలి నాని బాధ్యతా రాహిత్యంతో మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన కొడాలి నాని పై తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొడాలి నానికి దేవినేని ఉమా కౌంటర్ ఇచ్చారు.

జగన్ కనుసన్నల్లోనే రెచ్చిపోతున్న మంత్రులు
భారీ వర్షాలతో దెబ్బతిన్న ముంపు ప్రాంతాలలో చంద్రబాబు పర్యటిస్తే దానిని కూడా రాజకీయం చేస్తారా అంటూ మండిపడిన దేవినేని ఉమా, ఏపీ ప్రజలు వర్షాల ధాటికి విలవిలలాడుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి పెళ్ళిళ్ళు ముఖ్యమా అంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తో కలిసి విందు భోజనాలు ముఖ్యమా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కొడాలి నాని నీది ఒక బతుకేనా అంటూ విరుచుకుపడ్డారు. పదవి కోసం బూట్లు నాకే స్వభావం కొడాలి నానీదని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి కనుసన్నల్లోనే వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

పశువుల కన్నా హీనంగా బూతుల మంత్రి కొడాలి నాని తీరు
పశువుల కన్నా హీనంగా బూతుల మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. బూతుల మంత్రి కొడాలి నానికి ప్రజల సమస్యలు తెలుసా అంటూ ప్రశ్నించారు. ఒక పక్క రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ బూతుల మంత్రితో చంద్రబాబుపై మాట్లాడిస్తున్నారు అంటూ దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై లేదా అని ప్రశ్నించిన దేవినేని ఉమా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే బూతులు మాట్లాడతారా అంటూ మండిపడ్డారు.

చంద్రబాబు వాస్తవాలు బయటపెడితే బూతుల మంత్రితో దాడులు చేయిస్తారా?
కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం సరికాదని పేర్కొన్న ఆయన వైసీపీ నేతలు కనీసం మనుషుల్లా ప్రవర్తించాలని దేవినేని ఉమా హితవు పలికారు. వరద బాధితుల పట్ల జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు వాస్తవాలను బయటపెట్టారని, ఇక ఇదే విషయాన్ని అడుగుతుంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాటల దాడికి దిగుతున్నారు అని దేవినేని ఉమా పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాలలో వాటర్ మేనేజ్మెంట్ లేదని, ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేదని, చంద్రబాబు వాస్తవాలు బయటపెడితే బూతుల మంత్రితో దాడులు చేస్తున్నారని దేవినేని ఉమా ధ్వజమెత్తారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తో కన్నీరు పెట్టించారని, ఆయన సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అసహనం వ్యక్తం చేసిన దేవినేని ఉమా అసెంబ్లీ చరిత్రలో ఎవరి కుటుంబ సభ్యుల పైన అయినా గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారా అని ప్రశ్నించారు .