వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింహాచలనం అప్పన్నదర్శనం:సామన్యులకు క్షణం...విఐపిలకు పూర్తి వీక్షణం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:తమ ఇష్టదైవాలను కనీసం లిప్త పాటు వీక్షించేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా సామాన్య భక్తులను చులకనగా చూస్తున్న ఆలయ అధికారుల వైఖరి ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారుతోంది.

సాధారణ భక్తుల దైవదర్శనంపైనా రేషన్ విధిస్తూ అదే విఐపిలకైతే మాత్రం తలుపులు బార్లా తెరిచివుంచుతున్న అధికారుల తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టిటిడిలో ఈ వివాదం సర్వసాధారణం కాగా తాజాగా సింహాచలం అప్పన్న దర్శనం విషయంలోనూ ఆ ఆలయ అధికారుల తీరు ఇంతకంటే ఘోరంగా ఉందని భక్తులు మండిపడుతున్నారు. కాసుల కోసం కక్కుర్తిలో తాము దైవ సన్నధిలో పనిచేస్తున్నామన్న విషయాన్ని సైతం ఆలయ అధికారులు మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 సింహాచలం...దేవస్థానం...విశిష్టత

సింహాచలం...దేవస్థానం...విశిష్టత

విశాఖపట్టణానికి 11 కి.మీ. దూరంలో సింహాచలము అనే గ్రామంలో సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతం మీద శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నెలవైఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. అంతేకాదు మన రాష్ట్రంలో తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం కూడా ఇదే.సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు (మే నెలలో) వస్తుంది.

 ఈ సమస్య...ముఖ్యంగా...ఆరోజు

ఈ సమస్య...ముఖ్యంగా...ఆరోజు

అయితే ఈ దేవాలయానికి సంబంధించి ప్రత్యేక అంశం ఒకటుంది. ఈ ఆలయంలో సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవదేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన రోజులంతా ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. ఆ నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 18 వ తేదీన నిజరూప దర్శనం ఘడియలు ఆసన్నం కాగా అత్యంత పవిత్రమైన ఆ ఘడియల్లో దేవాలయ అధికారులు వ్యవహరించిన తీరు స్వామివారి ఆలయానికి అప్రతిష్ట కలిగించే విధంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం...ఏం జరిగిందంటే

బుధవారం...ఏం జరిగిందంటే

ఏడాదంతా చందన శోభితుడైన సింహాచలేశుడు ఆ గంధపు పూత నుంచి బయల్పడి నిజరూప దర్శనం లభించే అరుదైన సమయంలో...అతి పవిత్రమైన ఆ అమృత ఘడియల భాగ్యం దక్కే ఒకే ఒక్క రోజును ఆలయ అధికారులు, దళారులు తమ స్వార్థ ప్రయోజనాలకు ఆలంబనగా చేసుకొన్నారని, వివిధ ప్రయోజనాల కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారు కొందరైతే అయినకాడికి డబ్బులు దండుకున్నవారు మరికొందరని భక్తులు ఆరోపించారు. విఐపీలకు, సంపన్నులకు దగ్గరుండి అంతరాలయ దర్శనాలు చేయించిన అధికారులు, దళారులు...సాధారణ భక్తులకు మాత్రం కొన్ని క్షణాల దర్శన భాగ్యం...అది కూడా 20 అడుగుల దూరం నుంచి మాత్రమే దర్శించడానికి అవకాశమిచ్చారని వారు మండిపడుతున్నారు.

 సుదూర ప్రాంతాల నుంచి...వ్యయప్రయాసల కోర్చి

సుదూర ప్రాంతాల నుంచి...వ్యయప్రయాసల కోర్చి

స్వామివారి నిజరూపాన్నిదర్శించి తరించేందుకు సుదూర ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి సైతం లక్షలాది మంది భక్తులు మంగళవారం అర్ధరాత్రికే సింహాచలం చేరుకున్న పరిస్థితి. అయితే ఎంతో వ్యయప్రయాసల కోర్చి సింహాచల అప్పన్న నిజరూప దర్శనానికి విచ్చేస్తే ఇక్కడి దేవాలయం అధికారుల తీరు తమనెంతో మనోవేదనకు గురిచేసిందని భక్తులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇంతకుముందు ఎన్నడూలేని విధంగా ఈసారి ఆలయ అధికారులు కేవలం లిప్త కాలంపాటు మాత్రమే దర్శనానికి అనుమతినివ్వడం, భక్తులతో అనుచితంగా ప్రవర్తించడం, వీఐపీలకు, దళారులకు మాత్రమే అంతరాలయ దర్శన ఏర్పాట్లు చేయడంతో ఈ ఏడాది కూడా చందనోత్సవ నిర్వహణ తీరు పై భక్తులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

 నిబంధనలకు...తిలోదకాలు

నిబంధనలకు...తిలోదకాలు

స్వామివారి నిజరూప దర్శనం రోజున మంత్రులు, న్యాయమూర్తులు, ఐఏఎస్‌ అధికారులు, వీఐపీలు తదితర ప్రముఖులకు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు అనుమతిస్తామని స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఈవో చంద్రమోహన్‌ కొద్దిరోజులుగా ప్రకటిస్తూ వచ్చారు. అయితే చందనోత్సవం రోజు వచ్చేసరికి అసలైన ప్రొటోకాల్‌ నిబంధనలన్నింటికీ దేవాలయ సిబ్బంది తిలోదకాలు ఇచ్చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రొటోకాల్‌ దర్శనాలు మొదలవడంతో రూ.500, రూ.200లు టికెట్లు కొనుక్కొని క్యూల్లో నిలుచున్న భక్తులకు కష్టాలు మొదలయ్యాయి. ఆయా టికెట్లకు తొందరగానే దర్శనం అందుతుందని అధికారులు చెప్పగా ఆచరణలోకి వచ్చేసరికి ఆ ప్రొటోకాల్‌ దర్శనాల దెబ్బకు ఈ భక్తుల దర్శనానికి మూడు, నాలుగు గంటలపైనే పట్టింది.

 మంత్రి, ఎమ్మెల్యే తీరుపై...భక్తుల ఆగ్రహం

మంత్రి, ఎమ్మెల్యే తీరుపై...భక్తుల ఆగ్రహం

మంత్రి గంటా శ్రీనివాసరావు తాను చెప్పిన మాటలకు తానే విరుద్దంగా ప్రవర్తించి తెల్లవారుజామున 3 గంటలకు పది వాహనాల్లో సుమారు 70 మందినిపైగా తీసుకుని వచ్చి ఆలయంలో హల్‌చల్‌ చేశారని, వారంతా దాదాపు గంటకు పైగా ఆయన ఆలయంలోనే ఉండిపోవడంతో క్యూలైన్లన్నీ స్తంభించిపోయాయని భక్తులు తెలిపారు. ఆ తర్వాత మరలా మంత్రి గంటా సతీమణి ఓ 30 మందిని తీసుకుని ఆలయంలోకి రాగా అప్పుడు కూడా సామాన్య భక్తుల క్యూలైన్లు నిలిచిపోయాయని ఆ తరువాత ప్రొటోకాల్‌ దర్శనాల వేళలకు ముందుగానే అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌ ఓ మంది అనుచరులతో వచ్చి ఆలయంలో ఆయన హడావుడి ఆయన చేశారని భక్తులు వాపోయారు.

అదేమని అడిగితే...దూషణల పర్వం

అదేమని అడిగితే...దూషణల పర్వం

సింహాచలం అప్పన్న ఆలయ ఆచారాలు, నిబంధనలకు విరుద్ధంగా భక్తులకు ఈసారి కేవలం ఒకటి రెండు క్షణాలే దర్శనం కల్పిస్తూ అధికారులు, ఆలయ సిబ్బంది చాలా అతిగా ప్రవర్తించారని, లఘుదర్శనం అని చెప్పికూడా అర నిమిషం సమయం కూడా ఇవ్వకుండా పదిసెకన్లకే లాగిపడేశారని, అదేమని అడిగితే స్వామి వారి విగ్రహం సమక్షంలోనే అసభ్య పదజాలంతో తిడుతున్నారని, వారి నోటికి దడిసి కొందరు భక్తులు కనీస సమయం దర్శనం కూడా చేయకుండానే వెళ్లిపోయారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

అక్రమాలపై...ఎంపీ, ఎమ్మెల్యేల పిర్యాదులు

అక్రమాలపై...ఎంపీ, ఎమ్మెల్యేల పిర్యాదులు

మరోవైపు రూ. 1000 వీఐపీ టికెట్ల విషయమై అక్రమాలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ స్వయంగా ఎంపీ,ఎమ్మెల్యేలే విచారణకు డిమాండ్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రూ. 1000 వీఐపీ టికెట్లు ఈసారి 8 వేలు ముద్రించామని, బ్యాంకుల్లోనే విక్రయాలు చేస్తామని చెప్పిన అధికారులు ఆ మేరకు బ్యాంకుల్లో మంగళవారం సాయంత్రం వరకు విక్రయాలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా బుధవారం ఆయా టికెట్లు తీసుకొచ్చిన వారి సంఖ్య 15 వేల మందికిపైగానే ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 8 వేల టికెట్లే ముద్రిస్తే 15 వేల మంది ఎలా వచ్చారు... అంటే బ్లాక్‌లో టికెట్ల విక్రయాలు జరిగాయా లేక నకిలీ టికెట్లు ముద్రణ జరిగిందా అనే విషయమై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

 ఈవో రామచంద్రపై...పిర్యాదుల పర్వం

ఈవో రామచంద్రపై...పిర్యాదుల పర్వం

సింహాచలం అప్పన్న ఆలయ ఈవోగా కె.రామచంద్రమోహన్‌ ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తుండటం గమనార్హం. నిజానికి రాష్ట్రంలోని ఏ ప్రధాన దేవాలయంలో ఒకే ఈవో ఇలా ఏకధాటిగా ఐదేళ్లు కొనసాగడం అనేది ఎక్కడా లేదు. కానీ ఈ విషయంలో ఈవో రామచంద్రమోహన్‌ స్టైలే వేరని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ముఖ్యనేతల ప్రసన్న చేసుకోవడంలో ఆయనది అందెవేసిన చెయ్యని చెబుతున్నారు. ఏమాత్రం విమర్శలకు, ఆరోపణలకు తావులేకుండా చందనోత్సవం నిర్వహిస్తానని చెప్పుకుంటూ వచ్చిన ఆయన ఈ ఏడాది ఎప్పటికంటే మరి ఎక్కువ విమర్శలు మూటగట్టుకున్నారు. వీఐపీల సేవలోనే తరించడం, ఆలయ నిబంధనలకు విరుద్ధంగా వేళ కాని వేళల్లో వీఐపీలను గంటల తరబడి అనుమతించడం, టికెట్ల విక్రయాల్లో గోల్ మాల్ తదిదర ఆరోపణలతో పాటు ఆలయంలో కనీస ఏర్పాట్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

English summary
Visakhapatnam: It has been the same old story at the annual Chandanotsavam festival of Lord Varaha Lakshmi Narasimha Swamy at Simhachalam, as many devotees have flocked to witness the “Nijaroopa darshanam” of the deity on the auspicious day in the Visakhapatnam district on Wednesday. Several devotees alleged that while preference was given to the VIP devotees, they were left to stand under the sun for hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X