ఆదానీతో చీకటి ఒప్పందాలు - పేదవాడిని కొట్టి : తెలంగాణకు పరిశ్రమలు - నరేంద్ర..!!
ఒక్క ఛాన్స్ అని వేడుకున్న జగన్.. ఇప్పుడు ఛార్జీలతో బాదేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు. ఒకప్పుడు వెలుగుల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంధకార ఆంధ్రప్రదేశ్గా మారిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా ఛార్జీ పెంచలేదని చెప్పుకొచ్చారు. పవర్ కట్లు.. పవర్ హలిడేల్లో మాత్రం జగన్ ప్రభుత్వం ప్రగతిని సాధించిందని ఎద్దేవా చేసారు. జగన్ వైఖరి వల్ల.. ఏపీలోని విద్యుత్ కోతల వల్ల ఏపీ నుంచి పరిశ్రమలు తెలంగాణకు తరలిపోతున్నాయని చెప్పుకొచ్చారు.
కొత్త పరిశ్రమలు రావడానికే భయపడుతున్నాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రోజూ సీఎం జగన్ కు దండం పెడుతున్నారని...జగన్ వైఖరి వలన తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు కారణంగా పేదలపై వేల కోట్ల రూపాయలు భారం వేస్తున్నారని నరేంద్ర ఆరోపించారు. ఏపీలోనే సోలార్ పవర్ రూ. 2కే లభ్యమవుతోంటే.. అదానీ దగ్గర నుంచి రూ. 4కు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.

ఏపీలో పేదవాడిని కొట్టి అదానీకి పెడుతున్నారని నరేంద్ర ఫైర్ అయ్యారు. ప్రజలేమైనా ఫర్వాలేదు.. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు మాత్రం ఆగకూడదనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. యూనిట్ రూ 12కు మించకుండా విద్యుత్ కొనుగోలు చేయొద్దంటూ ఏపీ ఈఆర్సీ సీలింగ్ విధించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల నుంచి ఏడు గంటలకు తగ్గించారు.. ఇప్పుడు రోజుకు గంట విద్యుత్ సరఫరా ఉండడం కూడా గగనంగా మారిందని చెప్పుకొచ్చారు.
విద్యుత్ కోతలపై ఏపీ ఈఆర్సీ ఆదేశాలు జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థత.. వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ఏపీ ఈఆర్సీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా జరగని అద్భుతాలు ఏపీలోనే జరుగుతాయని ఎద్దేవా చేసారు. విద్యుత్ కోతలతో ఆక్వా రంగం అల్లాడుతోందని నరేంద్ర చెప్పుకొచ్చారు.