సీఎం జగన్ దెబ్బకు నిమ్మగడ్డ హడల్.. ఇంకా నిగ్గు తేలాల్సినవి మూడు.. విజయసాయిపై క్రిమినల్ కేసులంటూ..
చూడబోతే తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు సీఎం జగన్ కు కొద్దిగా కలిసొచ్చినట్లున్నాయి. చాలా కాలంగా అధికార పార్టీకి తలనొప్పిగా మారిన 'నిమ్మగడ్డ లేఖ' వ్యవహారంలో కొద్దిగా అనుకూలత ఏర్పడింది. ఇదే అదనుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంకాస్త విజృంభించారు. మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. అదేసమయంలో టీడీపీ కూడా వైసీపీపై తీవ్రస్వరంతో ఎదురుదాడికి దిగింది. కరోనా కేసులతోపాటు ఏపీలో పొలిటికల్ హీట్ కూడా కాకరేపుతున్నాయి.
మళ్లీ తెరపైకి నిమ్మగడ్డ లేఖ: ఆ ముగ్గురిపైనే విజయసాయిరెడ్డి అనుమానం: విచారణ జరిపించాలంటూ..!

సీన్ రివర్స్..
ఏపీలో తన ప్రాణాలకు రక్షణ లేదని, సీఎం జగన్ పరిపాలన అరాచకంగా ఉందని, కేంద్రం నుంచి సెక్యూరిటీ కావాలంటూ అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేరుతో విడుదలైన లేఖ పెనుదుమారం రేపడం తెలిసిందే. కేంద్ర హోం శాఖకు వెళ్లిన ఆ లేఖతో తనకే సంబంధంలేదని అప్పట్లో నిమ్మగడ్డ లీకులిచ్చారు. అయితే, సదరు లేఖపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేయడంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. యువ ముఖ్యమంత్రిగా దేశమంతా జగన్ వైపు చూస్తున్నవేళ.. రాష్ట్రంలో కొందరు దొంగదాడులకు తెగబడుతున్నారని, అయినాసరే సీఎం తన పనితోనే జవాబిస్తూ ముందుకుపోతున్నారని విజయసాయి గుర్తుచేశారు.

యాక్షన్.. రియాక్షన్..
ఆ లేఖ టీడీపీ ఆఫీసులో తయారుచేసిన నకిలీదని, దానిపై రమేశ్ కుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఎంపీ ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ లో చేసిన సంతకానికి, కేంద్రానికి రాసిన లేఖలోని సంతకానికి చాలా తేడాలున్నాయని, ఇది కచ్చితంగా టీడీపీ ఆఫీసులో ఫోర్జరీ చేశారన్న సమాచారం తమకుందని, దీని వెనుక టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్య, సీనియర్ నేత టీడీ జనార్ధన్ల హస్తం ఉందని ఆరోపించారు. వైసీపీ ఇలా డీజీపీకి లేఖ రాసిన కొద్దిసేపటికే.. రమేశ్ కుమార్ నిజం ఒప్పుకుంటూ సంచలన ప్రకటన చేశారు.

రాసింది నేనే..
పెనుదుమారం రేపిన లేఖపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న నిమ్మగడ్డ.. డీజీపీకి వైసీపీ ఫిర్యాదు తర్వాత ఠక్కున స్పంచారు. ‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఆ లేఖ రాసింది నేనే. నాకున్న అధికార పరిధిలోనే కేంద్రానికి విషయాలను చేరవేశాను. ఆ లేఖపై ఎవరికీ అనుమానాలు అక్కర్లేదు. అది నేను రాసిందేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి(కిషన్ రెడ్డి) కూడా నిర్ధారించారు. కాబట్టి దీనిపై వివాదంగానీ, రాద్ధాంతంగానీ అవసరంలేదు''అని రమేశ్ కుమార్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే లేఖ రాశానని నిమ్మగడ్డ ఒప్పుకున్నంత మాత్రాన ఈ వ్యవహారాన్ని తేలికగా వదిలేయబోమని విజయసాయి స్పష్టం చేశారు.

తేలాల్సినవి మూడు..
‘‘కేంద్ర హోం శాఖకు లేఖరాసి, మెల్లగా హైదరాబాద్ జారుకున్న నిమ్మగడ్డకు.. ఇవాళ దర్యాప్తు అనేసరికి ముచ్చెమటలు పట్టినట్లున్నాయి. అందుకే నెల రోజుల తర్వాత నోరు విప్పి ఆ లేఖ రాసింది తానే అని ఒప్పుకున్నాడు. బహుశా ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుందో ఆయనకు బోధపడినట్లుంది. అయినాసరే, ఇంకా నిగ్గు తేలాల్సిన అంశాలు మూడున్నాయి. నిమ్మగడ్డ పేరుతో ఆ లేఖపై సంతకం చేసింది ఎవరు? లేఖను ఏ ఐపీ అడ్రస్ ద్వారా హోం శాఖ అధికారికి మెయిల్ చేశారు? ఆ లేఖను ఎక్కడ, ఎవరు డ్రాఫ్ట్ చేశారు? ఈ విషయాలపై పోలీసుల దర్యాప్తు చేస్తేనే కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ బైటకు వస్తాయి''అని విజయసాయి అన్నారు.

క్రిమినల్ కేసులు పెడతాం..
కాగా, నిమ్మగడ్డ లేఖను ఫోర్జరీ చేశారన్న వైసీపీ ఆరోపణలపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకుగానూ విజయసాయి రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకుంటే క్రిమినల్ కేసులు తప్పవని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా నియంత్రణలో సీఎం జగన్ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికే విజయసాయి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని, నిమ్మగడ్డ లేఖతో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని కనకమేడల చెప్పారు. కరోనా వైరస్ ను అదుపుచేయాల్సిందిపోయి ఇలాంటి గిమ్మిక్కులతో ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తున్నారని టీడీపీ రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్య ఫైరయ్యారు.