Ysrcp: విజయసాయిరెడ్డి భార్య వద్ద వజ్రాలు??
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ్యకు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీద మస్తాన్ రావు, విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి పేర్లను అధికార పార్టీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నలుగురు తమ పూర్తి వ్యక్తిగత వివరాలను ఎన్నికల సంఘానికి అఫిడవిట్ రూపంలో తెలియజేశారు.
వైసీపీ నుంచి రెండోసారి రాజ్యసభకు ఎంపికవుతున్న విజయసాయిరెడ్డి ఆస్తుల విలువ రూ.21.57 కోట్లు. ఆయన భార్య సునందారెడ్డి వద్ద 1456 గ్రాముల బంగారంతోపాటు రూ.2.90 కోట్ల విలువ చేసే వజ్రాలు కూడా ఉన్నాయి. అలాగే రూ.24.65 లక్షల రుణాలున్నాయి. వీటితోపాటు తనపై 19 కేసులున్నట్లు విజయసాయిరెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో సాయిరెడ్డి ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులు 8 ఉండగా, సీబీ ఐ కేసులు 11 ఉన్నట్లు సాయిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం వాటి విచారణను ఎదుర్కొంటున్నట్లు వివరించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, అవినీతి నిరోధక చట్టం, మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద విజయసాయిరెడ్డిపై కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలో పార్టీ తరఫున కార్యక్రమాలను చక్కబెట్టడానికి, కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యంగా మెలగడానికి విజయసాయిరెడ్డి అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను ఎంపిక చేశారు. వాస్తవానికి 2024 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేయాలనే యోచనలో సాయిరెడ్డి ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను పాటిస్తానన్నారు.