చంద్రబాబు ట్రాప్లో ముఖ్యమంత్రి జగన్? సులువుగా పడిపోయారే??
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ట్రాప్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈజీగా పడిపోయారని ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతి సమావేశంలో, ప్రతి సభలో చంద్రబాబునాయుడి గురించి, పవన్ కల్యాణ్ గురించి, ఎల్లో మీడియా గురించి ప్రస్తావించకుండా మాత్రం జగన్ ఉండలేకపోతున్నారని, ట్రాప్ అంటేనే అది అని అర్థం చెబుతున్నారు.

కథనాలు చూసి ఉద్రేకపడుతున్న జగన్?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల కథనం ప్రకారం ముఖ్యమంత్రి జగన్ ప్రతిరోజు ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలను చూసి ఉద్రేకపడిపోతున్నారని, అందుకే ఏ సభకు వెళ్లినా, సమావేశానికి వెళ్లినా దుష్టచతుష్టయం అంటూ ప్రస్తావిస్తున్నారని చెబుతున్నారు. కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి జగన్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి చెప్పడం తగ్గించేశారని, చంద్రబాబుపై, పవన్ కల్యాణ్, ఎల్లోమీడియాపై ధ్వజమెత్తడమే సరిపోతుందని విశ్లేషిస్తున్నారు.

దుష్టచతుష్టయం నుంచి దూరంగా ఉండాలి
సభలో పాల్గొన్నప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి చెబుతున్నారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని కోరుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆతర్వాతే జగన్ ఉద్రేకపడిపోతున్నారు. దుష్టచతుష్టయం నుంచి దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఆయన దృష్టిలో దుష్టచతుష్టయం అంటే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ-5 అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబు వ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోతున్న జగన్
ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటే సరిపోతుందని, కానీ జగన్ అనవసరంగా దుష్టచతుష్టయం అంటూ మాట్లాడుతూ వారికే క్రేజ్ తెస్తున్నారని, ఇదంతా చంద్రబాబునాయుడి వ్యూహమని తెలుసుకోలేకపోతున్నారని వైసీపీ సీనియర్ నేతలు అంటున్నారు. తమ ముఖ్యమంత్రి ఈజీగా చంద్రబాబు ట్రాపులో పడిపోయారని విశ్లేషిస్తున్నారు.