చంద్రబాబు ఒంటరయ్యారా : అటు కేంద్రంలో - ఇటు రాష్ట్రంలో : నాడు జగన్ ట్రాప్ తో..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ రాజకీయాలకే పరిమితమయ్యారా. జాతీయ స్థాయిలో ఆయన పరపతి ఏమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎక్కడా ఆయన పేరే ప్రస్తావనకు రావటం లేదు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పొత్తులు - టీడీపీ ఎక్కడా స్పందించటం లేదు. పవన్ సైతం టీడీపీ తగ్గాలని చెబుతున్నా... చంద్రబాబు మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా ప్రచారం ఉన్న చంద్రబాబు ఇప్పుడు దాదాపుగా ఏపీకే పరిమితం అయ్యారు. కనీసం తెలంగాణ రాజకీయాల పైనా స్పందించటం లేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ఎన్నికల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్ధికి వైసీపీ మద్దతు ప్రకటించింది. కేంద్రంలోని బీజేపీ ముఖ్యులు సీఎం జగన్ ను నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించారు.

చంద్రబాబు ఒంటరి పోరాటం
వైసీపీ నుంచి విజయ సాయి రెడ్డి హాజరయ్యారు. గతంలోనే బీజేపీతో టీడీపీ అధినేత విభేదించి ఉండటంతో..టీడీపీని సంప్రదించ లేదు. ఇక, ఎన్డీఏతో విభేదించిన తరువాత చంద్రబాబు 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ తో జత కలిశారు. విపక్ష పార్టీలతో కలిసి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పని చేసారు. ప్రధాని మోదీ ఓటమి ఖాయమని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు ఆ విపక్ష పార్టీల నుంచీ రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక సమయంలో టీడీపీ అధినేత కు ఆహ్వానం అందలేదని సమాచారం. సమావేశం నిర్వహించిన మమతా బెనర్జీ తొలి నుంచి ఎన్డీఏతో ఉన్న వైసీపీ అధినేత జగన్ కు లేఖ రాసారు. తమ సమావేశానికి రావాలని కోరారు. కానీ, సీఎం జగన్ స్పందించ లేదు. ఇక, ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ..ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

ఏపీలోనూ జాగ్రత్తగా అడుగులు
దీని కోసం ఇప్పటికే జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. అయితే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే ఇబ్బందులు వస్తాయని..ఎక్కడా వైసీపికి అవకాశం ఇవ్వకూడదనేది ఆయన అభిప్రాయం. ఇందు కోసం పవన్ కళ్యాణ్ తో తిరిగి జత కట్టాలని ఉన్నా.. పార్టీ లో కొందరు వ్యతిరేకిస్తున్నా.. జనసేనాని వ్యాఖ్యలు ఇబ్బంది కరంగా ఉన్నా వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు స్పందించి..విభేదించటం కంటే సరైన సమయంలో దగ్గరై..ఉమ్మడి రాజకీయ ప్రత్యర్ధి జగన్ ను దెబ్బ తీయటమే లక్ష్యమని భావిస్తున్నారు. కానీ, ఈ సారి పవన్ కళ్యాణ్ అంత తేలిగ్గా రాజీ పడే పరిస్థితులు కనిపించటం లేదు. సీట్లు.. అధికారంలో ఖచ్చితంగా తేల్చిన తరువాతనే పొత్తు కోసం అంగీకరించే ఛాన్స్ కనిపిస్తోంది. అటు బీజేపీ ని సైతం తమ రెండు పార్టీలతో కలిసి వైసీపికి వ్యతిరేకంగా నిలిపేందుకు పవన్ కళ్యాణ్ తన స్థాయిలో ప్రయత్నాలు చేసారు. కానీ, అవి ఫలించలేదని సమాచారం.

జగన్ తో గెలిస్తేనే పూర్వ వైభవం
బీజేపీ తిరిగి టీడీపీతో జత కట్టే విషయంలో ముందుకు రావటం లేదు. పవన్ ను వదిలి..టీడీపీతో కలిసేందుకు సమ్మతించటం లేదు. పవన్ సైతం తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే టీడీపీతో పొత్తు అనే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఇక, మోదీని సైతం ధిక్కరించి జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలతో 2019 ఎన్నికల్లో ఢిల్లీ కేంద్రంగా కీలకంగా నిలిచిన చంద్రబాబుకు..ఇప్పుడు ఆ పార్టీల నుంచి ఎటువంటి సంప్రదింపులు లేవు. దీంతో..2019 లో ఎన్డీఏ కు దూరం అవ్వటం మొదలు.. కేవలం 3 లోక్ సభ సీట్లు.. 23 అసెంబ్లీ స్థానాలు గెలవటం.. ప్రధాని - అమిత్ షా తో సీఎం జగన్ కు సాన్నిహిత్యం ఏర్పడటం సైతం ఇప్పుడు ప్రభావం చూపుతున్నాయి. అయితే, ఇప్పుడు వీటి కంటే 2024 ఎన్నికల్లో ఏపీలో ఎంపీ - ఎమ్మెల్యే సీట్లు గెలవటం ద్వారా రాష్ట్రంలో అధికారం.. కేంద్రంలో గుర్తింపు తిరిగి అవే వస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. అటు సీఎం జగన్ సైతం అదే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు. దీంతో..ఇప్పుడు ఢిల్లీ -అమరావతి రాజకీయాల పైన ఆసక్తి పెరుగుతోంది.