వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయనగరం వైసీపీలో ముసలం: బొత్స కోలగట్ల వర్గాల మధ్య విభేదాలు..?

|
Google Oneindia TeluguNews

విజయనగరం వైసీపీలో ముసలం ఏర్పడిందా... అక్కడి సీనియర్ నాయకుల్లో సమన్వయం లోపించిందా... నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి విబేధాలు చేరాయా...? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో విజయనగరంలో సీనియర్ వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ అధినేత జగన్‌కు తలనొప్పిగా మారింది. ఇంతకీ ఎవరా సీనియర్ నాయకులు..?

విజయనగరం జిల్లా వైసీపీ నేతల్లో వ్యక్తిగత ఇమేజ్ ప్రెస్టీజియస్‌గా మారింది. పార్టీకంటే తమ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకే అక్కడి సీనియర్ నేతలు పాట్లు పడుతున్నారు. అధికార పార్టీపై యుద్ధం ప్రకటించి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన నేతలు తమలో తాము గొడవపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరు సీనియర్ నేతల మధ్య రాజుకున్న చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరనేగా... వారే మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, మరో సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి.

బొత్స - కోలగట్ల మధ్య బహిర్గతమైన విభేదాలు

బొత్స - కోలగట్ల మధ్య బహిర్గతమైన విభేదాలు

వారిద్దరి మధ్య విబేధాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎవరికి వారుగా స్కెచ్‌లు వేసుకుంటుండటంతో విజయనగరం జిల్లా వైసీపీ క్యాడర్‌లో గందరగోళం మొదలైంది. ముందుగా కాంగ్రెస్ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరంలో తనకు తిరుగుండదని భావించారు. అదే సమయంలో సీనియర్ నేత బొత్స వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో సమస్య ప్రారంభమైంది. అప్పటి వరకు బొత్స కోలగట్ల మధ్య విబేధాలు చాపకింద నీరులా ఉండేవి. కొద్ది రోజుల క్రితమే ఆ విబేధాలు తారాస్థాయికి చేరుకుని బహిర్గతమయ్యాయి.దీంతో జిల్లాలో ఆ ఇద్దరు నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉన్నారు.

బొత్స వర్గంపై అసంతృప్తితో కోలగట్ల

బొత్స వర్గంపై అసంతృప్తితో కోలగట్ల

ఓ వైపు తనదైన ముద్ర వేసుకునేందుకు కార్యక్రమాల్లో బొత్స తన అనుచరులతో ముందుండేందుకు ప్రయత్నిస్తుండగా... బొత్స వర్గాన్ని కట్టడి చేసేందుకు పార్టీ పెద్దలకు ఎప్పటికప్పుడు కోలగట్ల ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఒక దశలో స్వయంగా పార్టీ అధినేత జగన్ కలగజేసుకుని సంయమనం పాటించాలని ఇద్దరికీ సూచించారు. అధినేత ముందు వారు తల ఊపినా... తిరిగి జిల్లాకు చేరుకునేసరికి ఎవరి పంతం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విబేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో కొద్ది రోజులు పార్టీకి పార్టీ కార్యకలాపాలకు వీరభద్రస్వామి దూరంగా ఉన్నారు. అప్పట్లో కోలగట్ట పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఆ తర్వాత అధినేత సర్ది చెప్పడంతో కోలగట్ట తగ్గారు.

 వేర్వేరు కార్యక్రమాలతో గందరగోళంలో జిల్లా వైసీపీ క్యాడర్

వేర్వేరు కార్యక్రమాలతో గందరగోళంలో జిల్లా వైసీపీ క్యాడర్

ఇక జిల్లాలో ఎవరి కార్యక్రమాలు వారు వేర్వేరుగా చేసుకుంటూ ముందుకు పోతుండటంతో జిల్లా వైసీపీ కేడర్‌లో కాస్త గందరగోళం నెలకొంది. ఎవరి శిబిరం వారిదే ఎవరి కార్యక్రమాలు వారిదే కావడంతో జిల్లా కార్యకర్తలు మధ్యలో నలిగిపోతున్నారు. ఇటీవల వైయస్ జయంతిని కూడా ఎవరికి వారే నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తుంటే పార్టీ కార్యకర్తలు ద్వితీయశ్రేణి నేతలు ఎవరి వైపు ఉండాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇటీవలే 2500 కిలోమీటర్లు పాదయాత్రను జగన్ కంప్లీట్ చేసిన నేపథ్యంలో కోలగట్ల మహిళలతో నిర్వహించిన భారీ ర్యాలీకి బొత్స వర్గం దూరంగా ఉండి మరో కార్యక్రమాన్ని నిర్వహించింది.

అవనాపు సోదరులను పక్కనబెట్టడంతో కోలగట్లపై గుర్రుగా ఉన్న బొత్స వర్గం

అవనాపు సోదరులను పక్కనబెట్టడంతో కోలగట్లపై గుర్రుగా ఉన్న బొత్స వర్గం

కోలగట్ల వీరభద్రస్వామి నిర్వహించిన కార్యక్రమానికి దూరంగా ఎందుకు ఉన్నారో మరో కారణం చెప్పుకొస్తోంది బొత్స వర్గం. జిల్లాలో వైసీపీని మొదటినుంచి నడిపించిన అవనాపు సోదరులను కోలగట్ట వర్గం పక్కకు బెట్టడం, కోలగట్ల తన కుటుంబ సభ్యులను రంగంలోకి దించడంపై బొత్స వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అంతేకాదు అవనాపు సోదరులను విస్మరించి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కోలగట్ల వీరభద్రస్వామి తన కూతురుని కానీ, అల్లడును కానీ రంగంలోకి దించే ప్రయత్నం చేస్తుండటంతో బొత్స వర్గానికి మింగుడుపడటం లేదు.

రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్న విజయనగరం జిల్లా ఇలా గ్రూపు రాజకీయాలతో నలిగిపోతుండటంతో వైసీపీ క్యాడర్ కాస్త నిస్తేజానికి గురవుతోంది. అంతేకాదు కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి దంపతులు అందరినీ ఎలాగైతే కలుపుకుని వెళుతున్నారో అలానే ఈ ఇద్దరు సీనియర్ నేతలు కలిసి అందరి నేతలను కలుపుకుని వెళితే జిల్లా వైసీపీకి తిరుగుండదని పార్టీ కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. మరో వైపు జిల్లా రాజకీయాలపై జగన్ పాదయాత్రలో ఉంటుండగానే ఆ జిల్లాకు చెందిన నాయకులతో ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్నట్లు సమాచారాం. బొత్స, కోలగట్ల వర్గాలు ఎవరి దారి వారు చూసుకుంటే... వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కోవడం కష్టతరం అవుతుందని విజయనగరం జిల్లా రాజకీయాలపై అవగాహన ఉన్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
Differences between two YCP senior leaders in Vijayanagaram district have reached to heights.Former minister and a senior leader Bothsa satyanarayana has expressed his dissatisfaction against another leader Kolagatla Veerabhadra swamy.Both the leaders are displaying their own strength in the district where the cadre is left with dissappointment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X