digvijay singh telangana samaikyandhra sai pratap దిగ్విజయ్ సింగ్ తెలంగాణ సమైక్యాంధ్ర అనంత వెంకట్రామి రెడ్డి సాయి ప్రతాప్
పశ్చాత్తాపమే: తెలంగాణవాదులపై డిగ్గీ ఆసక్తికర వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ విభజనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. డిగ్గీని శనివారం రాయలసీమ ప్రాంత పార్లమెంటు సభ్యులు అనంత వెంకట్రామి రెడ్డి, సాయి ప్రతాప్లు కలిశారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఏళ్లుగా కాంగ్రెసునే నమ్ముకొని ఉన్నామని, ఇంట్లోనైనా కూర్చుంటా కానీ పార్టీ మారమని డిగ్గీకి చెప్పారు. విభజనతో కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో లాభం జరగదని చెప్పారు.
ఈ సమయంలో దిగ్విజయ్ సింగ్ కల్పించుకొని ఇప్పుడు రాష్ట్ర విభజన కోరుకుంటున్న తెలంగాణవాదులు కూడా పదేళ్ల తర్వాత పశ్చాత్తాపం చెందుతారని వారితో అన్నారట. విభజన వ్యక్తిగతంగా తనకు ఇష్టం లేకపోయినా పార్టీ నిర్ణయాన్ని అనుసరించక తప్పని పరిస్థితి నెలకొందని అన్నట్లుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చినా ఆ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీకి వచ్చే లాభమేమీ లేదని, పార్టీకి ఏమాత్రం లబ్ధి చేకూర్చే అవకాశం లేనప్పుడు ఉపసంహరించుకోవాలని కోరారు.
అదే సమయంలో దిగ్విజయ్ సింగ్ రాయల తెలంగాణ ప్రతిపాదన పైన అనంతను ఆరా తీశారు. అందుకు అనంత రాయలసీమ ప్రాంత ప్రజలు రాయల తెలంగాణ కోరుకోవడం లేదని సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని చెప్పారు. విభజన వల్ల అన్ని ప్రాంతాలు దెబ్బతింటాయని చెప్పారు.