దీపావళికి కరోనా దెబ్బ- ఏపీతో పాటు దేశంలో క్రాకర్స్ కాల్చే సమయాలివే- గ్రీన్ క్రాకర్స్ అంటే ?
ఈ ఏడాది కరోనా కారణంగా దీపావళి వేడుకలు కళ తప్పాయి. పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి భయాలతో ప్రభుత్వాల, కోర్టులు బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, కాల్చడాన్ని కూడా నిషేధించాయి. కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న అన్ని చోట్లా ఈ ఏడాది బాణాసంచా క్రయ విక్రయాలు, కాల్చడాన్ని కూడా నిషేధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈసారి దీపావళి వేడుకలపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. పలు రాష్ట్రాల్లో గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే వాడేలా ఆదేశాలు ఇచ్చారు. అదీ కేవలం రెండు గంటలకు పరిమితం చేశారు. ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు మాత్రమే సాగుతున్నాయి.

దీపావళి క్రాకర్స్‌పై నిషేధం...
దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్ధితులతో వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. అందుకే చాలా చోట్ల దీపావళి టపాసులపై నిషేధం విధించగా.. కొన్ని చోట్ల మాత్రం గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే అనుమతిస్తున్నాయి.
కాలుష్య ప్రభావం తక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాలు మాత్రం బాణాసంచా అమ్మకాలను ఆంక్షలతో అనుమతిస్తున్నాయి. ఇందులో ఏపీ, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాలు గ్రీన్ క్రాకర్స్ విక్రయాలకు అనుమతి ఇచ్చాయి. దీంతో ఇప్పటికే పలుచోట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. పర్యావరణహితమైన గ్రీన్ క్రాకర్స్ కాల్చడం వల్ల కరోనా వ్యాప్తితో పాటు ఎలాంటి ఇతర అనర్ధాలు ఉండవన్న సంకేతాల నేపథ్యంలో ప్రస్తుతంత వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు కేవలం 30 మంది వ్యాపారులకు మాత్రమే లైసెన్స్ ఇచ్చారు.

రాష్ట్రాల్లో టపాసులు కాల్చే సమయాలివే...
ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అనుమతి ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు ఎందుకైనా మంచిదని టపాసులు కాల్చే సమయాన్ని భారీగా తగ్గించేశాయి. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకునేందుకు అనుమతిచ్చాయి. ఏపీలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే టపాసులు కాల్చాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పంజాబ్‌లోనూ రెండు గంటల పాటు మాత్రమే టపాసులు కాల్చాలని అమరీందర్‌సింగ్ ప్రభుత్వం ఆదేశించింది. అదీ దీపావళి, గురుపౌర్ణిమ రోజుల్లో మాత్రమే. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఈ రెండు రోజుల్లోనే రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యే క్రాకర్స్ కాల్చాలని సూచించింది. ఛత్ పూజ రోజు మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ టపాసులు కాల్చేందుకు అనుమతిచ్చింది. ఢిల్లీలో అయితే కేవలం రెండు రకాల గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చేందుకు కేజ్రివాల్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి ?
2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సాధారణ క్రాకర్స్ కంటే 30 శాతం తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే వాటిని గ్రీన్ క్రాకర్స్‌గా గుర్తించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ గ్రీన్ క్రాకర్స్‌ను సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ వంటి జాతీయ పరిశోధనా సంస్ధల్లో పనిచేసే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. గ్రీన్ క్రాకర్స్ చిన్న షెల్ సైజులో ఉండి స్వల్పంగా వీటి తయారీలో వాడిన ముడిపదార్ధాలను పేలుడులో విడుదల చేస్తాయని గుర్తించారు. అంతే కాకుండా ధూళిని తక్కువగా విడుదల చేసే కొన్ని రసాయన పదార్ధాలను కూడా వీటి తయారీలో వాడతారు. లిథియం, ఆర్సెనిక్, బేరియం, లెడ్ వంటి నిషేధిత రసాయనాలను ఇందులో వాడరు. వీటిని సేఫ్ వాటర్ రిలీజర్, సేఫ్ ధర్మైట్ క్రాకర్, సేఫ్ మినిమల్ అల్యూమినియం క్రాకర్స్‌గా కూడా పిలుస్తారు. ఇందులో మళ్లీ బేరియం అస్సలు వాడనివి, స్వల్పంగా వాడేవిగా కూడా విభజించారు. బేరియం నైట్రైట్‌ను అణుబాంబు, పూలకుండీలు, స్పార్క్లర్స్ తయారీలో వాడతారు.

గ్రీన్ క్రాకర్స్ గుర్తించడం ఎలా ?
మార్కెట్లో దీపావళి సందర్భంగా కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్మాలని నిషేధాజ్ఞలు విధించిన నేపథ్యంలో కొంత మేర సాధారణ క్రాకర్స్ కూడా వీటిలో కలిపి అమ్మేసే ప్రమాదం ఉంది. ఇందుకోసం గ్రీన్ క్రాకర్స్‌ను ప్రత్యేకంగా క్రాకర్ బాక్సులపై ముద్రించడంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నట్లు తమిళనాడు క్రాకర్ తయారీదారుల సంఘం చెబుతోంది. క్యూ ఆర్ కోడ్‌తో పాటు గ్రీన్ క్రాకర్స్‌ను గుర్తించేలా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అమ్మకందారులు చెబుతున్నారు. వీటిని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతున్నారు.

ఈ దీపావళికి గ్రీన్ క్రాకర్స్ తప్పనిసరి..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కోవిడ్ పరిస్ధితుల కారణంగా క్రాకర్స్‌పై పలు రాష్ట్రాలు పూర్తిగా నిషేధం విధించాయి. ప్రభుత్వాలతో పాటు కోర్టులు కూడా ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. అసలే చలికాలం, ఆపై కోవిడ్ పరిస్దితులు నెలకొన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఉన్నంతలో ఎక్కువ కాలుష్యం వెదజల్లని గ్రీన్ క్రాకర్స్ వాడకం తప్పనిసరని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. దీంతో వాడితే గ్రీన్ క్రాకర్స్ వాడటం లేదా అసలు టపాసులకే దూరంగా ఉండటమే మంచిదనేది నిపుణుల సూచన.