YCPలో ఆధిపత్య పోరు: బాలినేని శ్రీనివాసరెడ్డి Vs వైవీ సుబ్బారెడ్డి??
బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి అయ్యారు. వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నారు. వీరిద్దరూ బంధువులే. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికీ బంధువులే. అయితే ముఖ్యమంత్రి బంధువైనా తనకు దక్కాల్సినంత గౌరవం దక్కలేదనే అసంతృప్తి బాలినేనిని వెన్నాడుతూనే ఉంది. రెండోసారి మంత్రివర్గంలో పదవి దక్కించుకోలేకపోయానేన అసంతృప్తితోపాటు తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన స్పందించారు. తనవెనక కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు.
వాస్తవానికి బాలినేనికి, సుబ్బారెడ్డికి పొసగదనే విషయం వైసీపీలో అందరికీ తెలిసిన విషయమే. తనకు వ్యతిరేకంగా, తనకు చెడ్డపేరు వచ్చేలా జరుగుతున్నవన్నీ సుబ్బారెడ్డి చేపిస్తున్నారనేది బాలినేని ప్రధాన ఆరోపణ. సొంత పార్టీకి చెందినవారే కుట్రలు చేస్తుండటంతోపాటు వారికి తెలుగుదేశం పార్టీ నేతలు సహకరిస్తున్నారని బాలినేని చెబుతున్నారు. తనపై వచ్చే ఆరోపణలన్నీ తనకు చెడ్డపేరు తేవడానికి జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు.

తనకు వ్యతిరేకంగా తనవెనక ఎవరు గోతులు తవ్వుతున్నారో కూడా తనకు తెలుసన్నారు. తాను తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి విరమించుకుంటానననారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఎక్కడ ఏ అక్రమ సంఘటన జరిగినా దానివెనక బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారంటూ ప్రచారం చేయడం సాధారణమైపోయిందని, దీన్ని అడ్డుకుంటానని, ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో చర్చిస్తానన్నారు. ఏదేమైనప్పటికీ బాలినేనికి వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాలన్నింటి వెనక సుబ్బారెడ్డి ఉన్నారనే విషయాన్ని ఆయన పరోక్షంగా చెబుతున్నట్లైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.