ఏపీలో మంచినీటి సరఫరా .. ఇంటింటికీ తాగునీటి కుళాయిలు.. ఏపీ సర్కార్ మరో నిర్ణయం
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది .రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి తీసుకున్న నిర్ణయంతో బోర్లు, బావుల నుండి నీటిని తెచ్చుకునే పరిస్థితికి చెక్ పడనుంది.
ఆ ప్రాజెక్ట్ లు కొత్తవి కాదు .. మాట్లాడేందుకు మేం సిద్ధం .. కేంద్రమంత్రికి సీఎం జగన్ ప్రత్యుత్తరం

ప్రజల తాగునీటి అవసరాలు తీర్చనున్న ఏపీ సర్కార్
ప్రజల తాగునీటి అవసరాలతో పాటుగా, రోజువారి సాధారణ అవసరాలకు కావలసిన నీటిని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా అందించాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 95 .66 లక్షల ఇళ్లు ఉంటే ఇప్పటివరకు 31.93 లక్షల ఇళ్లలో నీటి కుళాయిలు ఉన్నాయి . నీటి సౌకర్యం లేని 63 .73 లక్షల ఇళ్లకు మంచి నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రణాళికలు సైతం సిద్ధం చేసింది గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ.

తొలి ఏడాది 32 లక్షల ఇళ్లకు కొత్తగా కుళాయిలు
నాలుగేళ్ల కాలపరిమితిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ నీటి కుళాయిలు ఉండాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందుకోసం తొలి ఏడాది 32 లక్షల ఇళ్లకు కొత్తగా నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ. దీనికోసం 4,800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. అయితే ఇందులో కేంద్రం జల జీవన్ మిషన్ కింద 2400 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

వచ్చే నాలుగేళ్లలో ప్రతి గ్రామంలోనూ నీటి సమస్యలు తీర్చాలనే లక్ష్యం
వచ్చే నాలుగేళ్లలో ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్యలు తీర్చాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం దీనికోసం 10,975 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. అయితే ఈ ఖర్చులో సగం కేంద్రం అందించే జల జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా అందనుంది.తొలి ఏడాది 32 లక్షల ఇళ్లకు కుళాయిల కనెక్షన్లు, రెండో ఏడాది 25 లక్షలు, మూడో ఏడాది ఐదు లక్షలు,నాలుగవ యేడాది మిగిలిన ఇళ్లకు కొత్త కుళాయి కనెక్షన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

75 శాతం నీటి సరఫరా చేసే సామర్ధ్యం ఉన్న గ్రామాలకు తొలి ప్రాధాన్యత
75 శాతం నీటి సరఫరా చేసే సామర్ధ్యం ఉన్న గ్రామాలకు తొలి ప్రాధాన్యత నిచ్చి, ఆయా గ్రామాలలో ఇళ్ళలో కుళాయిలు ఏర్పాటుచేసి తాగునీటి సౌకర్యం కల్పిస్తారు.
మంచినీటి పథకం, ఓవర్‌హెడ్ ట్యాంకులు వంటివి ఉన్న గ్రామాలలో తొలుత ఏర్పాటుచేసి, మిగతా గ్రామాలకు నాలుగేళ్ల కాలపరిమితిలో తాగునీటిని అందించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల ప్రజల నీటి కష్టాలు తీరనున్నాయి.