విజయవాడలో కలకలం: పార్శిల్లో పచ్చళ్లు పంపారా? డ్రగ్సా?, విదేశాలకు వెళ్లి వెనక్కి
అమరావతి: విజయవాడలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. సత్తెనపల్లికి చెందిన సాయిగోపి అనే వ్యక్తి పంపిన పార్శిల్లో డ్రగ్స్ ఉన్నట్లు బెంగళూరులో గుర్తించారు. ఈ పార్శిల్‌ను విజయవాడ డీటీఎస్ కొరియర్ నుంచి ఆస్ట్రేలియాకు పంపగా వివరాలు సరిగా లేక కెనడాకు వెళ్లింది. కెనడా నుంచి వెనక్కి వస్తుండగా.. బెంగళూరులో డ్రగ్స్ పార్శిల్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇందులో నాలుగు కేజీల డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇందుకు సంబంధించి కొరియర్‌బాయ్ తేజను ఏప్రిల్ 27న బెంగళూరు పిలిపించిన కస్టమ్స్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా కొరియర్ కార్యాలయంలో సాయిగోపి ఇచ్చిన ఆధార్ కార్డ్ నకిలీదని తేలింది. పట్టుబడిన పార్శిల్లో పిరిడిన్ అనే నిషేధిత డ్రగ్‌ను గుర్తించారు. అనంతరం కస్టమ్స్ అధికారులు ఈ విషయాన్ని విజయవాడ పోలీసులకు తెలియజేశారు.

స్థానిక పోలీసులు దీనిపై రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందాన్ని సత్తెనపల్లికి, మరో బృందాన్ని బెంగళూరు ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారుల వద్దకు పంపారు. సాయిగోపి ఇటీవల రెండుసార్లు పచ్చళ్ల పార్శిల్స్ పంపినట్లు పోలీసులు గుర్తించారు.
ఆ సమయంలో నిజంగా పచ్చళ్లు పంపాడా? లేదా ఇప్పటిలాగే డ్రగ్స్‌ను పంపాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని ఓ పోర్టులో పట్టుకున్న డ్రగ్స్‌ను పంపిన చిరునామా విజయవాడలో ఉండటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవల పలు నగరాల్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుపడుతుండటం కలకలం రేపుతున్నాయి.