పద్మలత, రాజు హత్యలు: ప్రధాని నిందితుడు డీఎస్పీ రవిబాబు లొంగుబాటు
విశాఖపట్నం: రెండు హత్యల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎస్పీ రవిబాబు చోడవరం పోలీస్ స్టేషన్లో శుక్రవారం లొంగిపోయారు. రౌడీ షీటర్ హత్య కేసులో రవిబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కిరాయి హంతకులతో గేదెల రాజును డీఎస్పీ చంపించినట్లు ఆరోపణలున్నాయి.

వివాహేతర సంబంధంతో పద్మలత హత్య..
గతంలో మాజీ ఎమ్మెల్యే కూతురు పద్మలతతో డీఎస్పీ రవిబాబు వివాహేతర సంబంధం కొనసాగించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే పద్మలతను గేదెల రాజుతో హత్య చేయించిన డీఎస్పీ రవిబాబు.. ఇందు కోసం కోటి రూపాయలు మాట్లాడుకుని.. రూ.50లక్షలు అతనికి అందించినట్లు తెలిసింది.
నా కూతురు పద్మలత జోలికి రావొద్దని డిఎస్పీని హెచ్చరించా: మాజీ ఎమ్మెల్యే

ఆ నిజం బయటపడకుండా రాజు హత్య
కాగా, మిగితా సొమ్ము ఇవ్వకుంటే హత్య విషయాన్ని బహిర్గతం చేస్తానని బెదిరింపులకు గురిచేయడంతో.. పద్మలత హత్య విషయం బయటపడకుండా ఉండేందుకు రాజును కూడా హత్య చేయించారు రవిబాబు.

మరో ఇద్దరు మిగిలారు..
గేదెల రాజు హత్య కేసులో మొత్తం 12మంది నిందితులుండగా, ఇప్పటికే 9మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన రవిబాబు కూడా లొంగిపోవడంతో మొత్తం పోలీసుల అదుపులో ఉన్న వారిక సంఖ్య 10కి చేరింది. మరో ఇద్దరినీ అరెస్ట్ చేయాల్సి ఉంది.

వ్యూహత్మకంగానేనా?
అయితే, వ్యూహత్మకంగానే డీఎస్పీ రవిబాబు చోడవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. తనకు ఆ హత్యలతో సంబంధం లేదని, న్యాయస్థానంలోనే పోరాడతానని రవిబాబు చెప్పినట్లు తెలిసింది. కాగా, పోలీసులు డీఎస్పీ రవిబాబును కోర్టు ముందు కస్టడీకి కోరే అవకాశం ఉంది.