మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుబ్బాక అసెంబ్లీ: రామలింగారెడ్డి వర్సెస్ ముత్యంరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Dubbaka assembly segment: Ramalinga Reddy vs Muthyam Reddy
సంగారెడ్డి: మెదక్ జిల్లా దుబ్బాక శాసనసభా నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థి, సిట్టింగ్ శాసనసభ్యుడు చెరుకూరి ముత్యం రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో బిజెపి అభ్యర్థిగా రఘునందన్ రావు బరిలో ఉన్నారు. మాజీ తెరాస నేత రఘునందన్ ఎవరి ఓట్లు చీలుస్తారనే విషయంపై జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.

మెదక్ జిల్లాలో భాగమైన దుబ్బాకలో తెలంగాణ ఉద్యమ ప్రభావం ఎక్కువే. దీనికితోడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వచ్చిన తర్వాత జరుగుతున్న తొట్టతొలి ఎన్నికలివి. తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన, సహకరించిన పార్టీలు నేరుగా తలపడుతున్న ఈ నియోజకవర్గంలో తొలి విజేత ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

దుబ్బాకలో ఉద్యమ ప్రభావం ఎంతగా ఉందో, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముత్యంరెడ్డికి నియోజకవర్గ అభివృద్ధి విషయంలోనూ అంతే సానుకూలత ఉంది. 1985 నుంచి వరుసగా నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో పౌరసరపరాల మంత్రిగా, అంచనాల కమిటీ చైర్మన్‌గా పని చేశారు. 2004లో తెలంగాణ ఉద్యమ ప్రభావంతో తెరాస అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో 24 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

2005లో సిద్దిపేట ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగి తెరాస నేత హరీష్ రావు చేతిలోనూ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ 2008లో జరిగిన దొమ్మాట ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి రామలింగారెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గ పునర్విభజనలో దొమ్మాటను దుబ్బాకగా మార్చారు. ఆ తర్వాత ఏడాదికే జరిగిన 2009 సాధారణ ఎన్నికల్లో తెరాస, తెలుగుదేశం పొత్తు పెట్టుకుని మహా కూటమి అభ్యర్థిగా రామలింగారెడ్డిని బరిలోకి దించాయి.

పొత్తు కారణంగా టికెట్ దక్కకపోవడంతో అప్పటి వరకు టీడీపీలో ఉన్న ముత్యంరెడ్డి కాంగ్రెస్‌లోకి మారారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి అనూహ్య విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఆయనకు సానుకూల అంశమైతే, నోటి దురుసు, పార్టీలో ఆయనపై అసమ్మతి ప్రతికూల అంశాలు.

జర్నలిస్టుగా పనిచేసి 2004 సాధారణ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా భారీ మెజారిటీతో అనూహ్య విజయం సొంతం చేసుకున్న సోలిపేట రామలింగారెడ్డి ఈసారి తెలంగాణ ఉద్యమ విజయం, కెసిఆర్ ప్రచారంపైనే ఆశలు పెట్టుకున్నారు. 2004లో భారీ మెజారిటీతో గెలిచినా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తన పదవికి ఆయన రాజీనామా చేశారు. అయినా, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన తన పూర్వపు మెజారిటీని సాధించలేకపోయారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చివరికి ఆయన ఓటమి పాలయ్యారు.

దొమ్మాటకు చివరి ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన దుబ్బాకకు తొలి ఎమ్మెల్యే కాలేకపోయారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన ఆయనపై 25 కేసులు ఉన్నాయి. ఈసారి చివరి క్షణం వరకు టికెట్ దోబూచులాడింది. పార్టీలో తనకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన తెరాస రాష్ట్ర నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డిని కాదని టికెట్ సంపాదించుకోగలిగారు. తాను ఎమ్మెల్యేగా పని చేసిన కాలంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అభివృద్ధి చేయలేకపోయానని ఆయన అంటున్నారు.

నియోజకవర్గంలో తక్కువగా ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన రఘునందనరావు తొలిసారిగా ఎమ్మెల్యే బరిలో నిలిచారు. దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్‌గా పని చేసిన ఆయనకు న్యాయవాదిగా మంచి పేరు ఉంది. నిన్న మొన్నటి వరకు తెరాసలో క్రియాశీలంగా వ్యవహరించిన ఆయన 2008లో జరిగిన ఉప ఎన్నికలో ఇక్కడి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. దీంతో, స్థానిక పరిస్థితులు తెలిసి ఉండడం ఆయనకు అనుకూలించే అంశం. అలాగే, ప్రత్యర్థుల ప్రతికూలతలు, తెలంగాణ సాధనకు సహకరించిన బిజెపి అభ్యర్థిగా బరిలో ఉండడం, దేశవ్యాప్తంగా మోడీ ప్రభావం, యువత ఆకర్షణ, బిజెపి ఎంపీ అభ్యర్థి నరేంద్రనాథ్ సామాజిక వర్గం, ఆయన చేసిన సామాజిక సేవలు ఆయనకు సానుకూల అంశాలు.

English summary
The fight in Dubbaka assembly segment will be between Congress candidate cheruku Muthyam Reddy and Telangana Rastra Samithi (TRS) candidate Solipeta Ramalinga Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X