దుబ్బాక ఫలితాల జోష్ .. ఏపీలో బీజేపీకి బూస్ట్ .. బీజేపీకి ప్లస్ అయ్యే అంశాలివే !!
దుబ్బాక ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో మంచి జోష్ ని తెచ్చాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దుబ్బాక ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బాగానే కనిపిస్తోంది. బిజెపి బలపడుతున్న సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నట్లుగా బీజేపీ నేతలు ఫీల్ అవుతున్నారు . దుబ్బాక విజయంతో మంచి జోష్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ అటు ఏపీలోనూ బలంగా పాగా వేయడం కోసం వ్యూహరచన చేస్తోంది.

వైసీపీ లో అంతర్గత కుమ్ములాటలు, తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న ఉదాసీనత,
ఏపీలో అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు, తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న ఉదాసీనత, ఇప్పటికీ కోలుకోలేకపోతున్న కాంగ్రెస్ కారణంగా ఏపీలో బలాన్ని పెంచుకోవాలని తెగ ప్రయత్నం చేస్తోంది బిజెపి. ఏపీ మీద ఫోకస్ పెట్టిన బిజెపి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఏపీలో అధికారంలోకి రావాలని తెగ ప్రయత్నిస్తోంది . ఈ నేపథ్యంలో దూకుడు పెంచిన బీజేపీ ఏపీలో అధికార వైసీపీ కంటే టిడిపి పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో టిడిపి నేతలపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించడం అందుకు ఉదాహరణ.

ఏపీలో టీడీపీ లేకుంటే ప్రత్యామ్నాయం బీజేపీనే
ఏపీలో టీడీపీని లేకుండా చేస్తే అధికార పార్టీ అయిన వైసిపికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. టిడిపి ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడం కోసం, అలాగే టిడిపి నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా టిడిపిని ఖాళీ చేయాలని బిజెపి రకరకాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకు సాగుతున్నారు.

తెలంగాణా దుబ్బాక జోష్ .. ఏపీపై గట్టిగానే ఫోకస్
రానున్న ఎన్నికల్లో ఏపీలో ప్రత్యామ్నాయం బీజేపీనే అని చూపించడం కోసం తెగ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్న తరుణంలో, అటు ఏపీలోనూ బిజెపి బలోపేతం అవ్వడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే దూకుడు పెంచిన బీజేపీ నేతలు రాష్ట్రంలో సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తున్నారు . ఇదే సమయంలో టీడీపీని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు .ఇదే సమయంలో దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం ఏపీలో బీజేపీకి బూస్ట్ లా పనిచేస్తుంది.