తుమ్మపూడి మహిళ హత్యాచారం కేసులో ట్విస్ట్: రేప్ కాదు, అక్రమ సంబంధంతోనే హత్య
గుంటూరు: దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై అత్యాచారం, హత్య జరిగిన ఘటన గుంటూరు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ హత్యాచారానికి సంబంధించిన కేసును పోలీసులు ఛేధించారు. అయితే, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ ఘటనలో అత్యాచారమే జరగలేదని పోలీసులు తమ విచారణలో తేల్చారు. మహిళ హత్యకు అక్రమ సంబంధమే కారణమని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.

కోరిక తీర్చేందుకు నిరాకరించినందుకే మహిళ హత్య
ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఆరిఫ్ వెల్లడించారు. మహిళను హత్య చేసిన నిందితుడు శివసత్యసాయిరాంతోపాటు ఆమెతో అక్రమ సంబంధం ఉన్న వెంకటసాయి సతీష్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. హతురాలి ఇంటికి సతీష్, అతని స్నేహితుడు శివ వెళ్లారు. తన కోరిక తీర్చాలని శివసత్య సాయిరాం మహిళను వేధించాడు. అయితే, ఆ మహిళ అందుకు నిరాకరించింది. ఈ విషయం గురించి అందరికీ చెబుతానని హతురాలు బెదిరించడంతో ఆమె చీరనే మెడకు బిగించి హత్య చేశాడని ఎస్పీ తెలిపారు.

ఒంటిపై దుస్తులు సక్రమంగా లేకుండా అచేతనంగా మహిళ
బాధితురాలు తిరుపతమ్మకు 15ఏళ్ల క్రితం శ్రీనివాసరావు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పొలాలకు నీళ్లు పెట్టే ట్యాబులు అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాసరావు పనుల కోసం గ్రామం విడిచి వెళ్తే ఐదు, ఆరు నెలలు ఇంటికి రాడు. గత డిసెంబర్ నెలలో ఆయన పనుల కోసం ఇంటి నుంచి వెళ్లాడు. కాగా, బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బాధితురాలు తిరుపతమ్మబంధువైన ఓ యువకుడు ఆమెను కలవడానికి ఇంటికి వెళ్లాడు. ఆమె ఒంటిపై దుస్తులు సక్రమంగా లేకుండా అచేతనంగా పడి ఉండటంతో వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 108 సిబ్బందికి కూడా సమాచారం అందించాడు.

మహిళపై హత్యాచారం కాదు.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి ఇంటి తలుపులు తెరిచి ఉండటం, ఆమె చెవి రింగులు పక్కనే పడిపోవడం.. గొంతుపై గట్టిగా నులిమినట్లున్న గుర్తులను పోలీసులు గుర్తించారు. దీంతో మృతురాలు భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించారు. తాను తిరుపతిలో ఉన్నట్లు వెంటనే గ్రామానికి వస్తున్నట్లు తెలిపాడు బాధితురాలి భర్త. తిరుపతమ్మ మృతిపై పలు అనుమానాలున్నాయని అతడు తెలిపాడు. కాగా, ఈ ఘటన సామూహిక అత్యాచారం కాదని, ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం కూడా లేదని ఎస్పీ ఆరిఫ్ స్పష్టం చేశారు. 24 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానికంగా వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత నారా లోకేష్ తుమ్మపూడిలో పర్యటించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరువర్గాల రాళ్లదాడుల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.