వైసీపీ కంచుకోటలో ఏం జరుగుతోంది : ఇగోలు - వర్గాలు : సీఎం జగన్ యాక్షన్ ప్లాన్..!!
వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ జిల్లా కంచుకోటగా నిలిచింది. 2014..2019 ఎన్నికల్లో ఒకే పార్టీకి పట్టం కట్టింది. నెల్లూరు జిల్లా వైసీపీకి తొలి నుంచి అండగా నిలిచింది. పార్టీ ఏర్పాటు సమయంలో కడపతో పాటుగా వైసీపీకి మరో ఎంపీ నెల్లూరు నుంచే ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఆ జిల్లాలో ఏడు స్థానాలు వైసీపీ దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో మొత్తం జిల్లాలోని పది స్థానాలు వైసీపీకి జిల్లా ప్రజలు కట్టబెట్టారు. ఎంపీ స్థానం వైసీపీకే దక్కింది. ఇక, స్థానిక సంస్థల ఎన్నికలు..నెల్లూరు కార్పోరేషన్ లోనూ వైసీపీ జెండానే ఎగిరింది. టీడీపీకి గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లోనూ వైసీపీ సునాయాసంగా గెలుపొందింది. అయితే, ఇంత పట్టు ఉన్న నెల్లూరు జిల్లాలో ఇప్పుడు అధికార వైసీపీ అంతర్గత పోరుతో సతమతం అవుతోంది.

నెల్లూరు వైసీపీ లో ఏం జరుగుతోంది
తాజాగా మాజీ మంత్రి అనిల్ - తాజా మంత్రి కాకాని మధ్య ఏర్పాటు చేసిన సభల ద్వారా కొత్త సమస్యలు రాకుండా అధినాయకత్వం ముందుగానే హెచ్చరిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరూ సభల్లో మాట్లాడారు. ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ, అదే సమయంలో ఒకరి సభలో మరొకరి పేరు ప్రస్తావించ లేదు. తనకు ఎవరూ పోటీ కాదని చెప్పిన అనిల్... కాకాని పేరు ప్రస్తావించి ఆయనతో తనకు ఎటువంటి విభేదాలు లేవని మాత్రం చెప్పలేకపోయారు. అందరూ జగన్ విధేయులే. కానీ, ఎవరికి వారే తమ ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సోమిరెడ్డి- నారాయణ-బీదా రవిచంద్ర వంటి నేతలు పార్టీ కోసం పని చేస్తున్నా..ప్రజల మద్దతు కూడగట్టటంలో విఫలం అవుతున్నారు.

పట్టం కట్టిన జిల్లాల్లో పట్టు తప్పుతోంది
ఇక, చంద్రబాబు - లోకేష్ సైతం ఈ జిల్లా పైన పెద్దగా ఫోకస్ పెట్టిన సందర్భాలు లేవు. అయితే, పార్టీకి కంచుకోటగా నిలిచిన జిల్లాలో వైసీపీ నేతలు మాత్రం ఎవరికి వారు వర్గాలుగా పోరాటం చేస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న సయయంలో ఈ జిల్లాలో నేదురుమల్లి - ఆనం - మేకపాటి- పనబాక వర్గాలు ఒకే పార్టీలో ఉంటూ ఎవరికి వారుగా వ్యవహరించేవారు. అయితే, ఇప్పుడు వైసీపీ నేతలు ఆ వారసత్వం కొనసాగిస్తున్నారనే వాదన ఉంది. ఇప్పుడు సైతం మేకపాటి..సంజీవయ్య..వరప్రసాద్ ఒకటిగా ఉంటున్నారనేది పార్టీ వర్గాల్లో ప్రచారం. అదే విధంగా.. కాకాని గోవర్ధన్ రెడ్డి..ఆనం రామనారాయణ రెడ్డి..కావలి ఎమ్మెల్యే ప్రతాప కుమార్ రెడ్డి ఒక్కటిగా నిలుస్తున్నారని చెబుతున్నారు.

కాంగ్రెస్ వర్గ రాజకీయాల కొనసాగింపు
తాజాగా.. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి హోదాలో జిల్లాకు వచ్చిన సమయంలోనూ.. ఆదాల - ఆనం మద్దతుతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చారు. సీనియర్ గా ఉన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సైతం తన నియోజకవర్గం మీదుగా కాకాని గోవర్ధన్ రెడ్డి స్వాగత ర్యాలీ వెళ్తున్నా..ఆయన ఎక్కడా హాజరు కాలేదు. ఇక, నెల్లూరు అర్బన్ - రూరల్ ఎమ్మెల్యేలు తమ రూటే సపరేటు అంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. దీంతో..వచ్చే ఎన్నికల్లో ప్రతీ సీటు..ప్రతీ ఓటు కీలకంగా భావిస్తున్న సీఎం జగన్ 2024 యాక్షన్ ప్లాన్ ఇప్పటి నుంచే సిద్దం చేస్తున్నారు. జిల్లాలో పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో ఆరా తీసినట్లు సమాచారం. అక్కడ వ్యవహారాలను సెట్ చేసే బాధ్యతలను మాజీ మంత్రి..సీనియర్ నేత బాలినేనికి అప్పగించినట్లుగా తెలుస్తోంది.

జగన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది
రెండు మూడు రోజుల్లో వైసీపీ పార్టీ పరంగా మాజీ మంత్రులు..సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దమైంది. ఈ క్రమంలోనే నెల్లూరు బాధ్యతలను బాలినేనిని ఇవ్వనున్నట్లు సమాచారం. ఇతర జిల్లాల కంటే పార్టీ బలంగా ఉన్న ఈ జిల్లాలో వెంటనే పరిస్థితులను చక్కదిద్దకుంటే..ప్రస్తుతం కొనసాగుతున్న కోల్డ్ వార్ రానున్న రోజుల్లో పార్టీకి నష్టం చేస్తుందనే అభిప్రాయం కేడర్ లో కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాల్లో ఏం జరగనుంది.. అధినాయకత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.