గ్రామాల్లో రాజుకున్న ఎన్నికల రాజకీయం ... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పంచాయితీ పోరుకు పార్టీలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. మొన్నటిదాకా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధానికి తెరదించుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అటు ప్రభుత్వం సైతం పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘంతో సహకరిస్తామని చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెలలో ఎన్నికల వేడి రాజుకుంటోంది.
పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాలలో పార్టీలు వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగాలని, విజయం సాధించే అభ్యర్థులనే, గెలుపు గుర్రాలనే బరిలో నిలపాలని తెగ కసరత్తులు చేస్తున్నాయి.
బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు .. పంచాయతీ పోరు కోసం టీడీపీ కంట్రోల్ రూమ్ : చంద్రబాబు

బరిలో నిలిచే అభ్యర్థులు, ఆశావహులతో గ్రామాలలో ఎన్నికల సందడి
ఇక బరిలో నిలిచే అభ్యర్థులు, ఆశావహులతో గ్రామాలలో ఎన్నికల సందడి కనిపిస్తోంది.ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఈ ఎన్నికలు తమకు ఎంతో ఉపకరిస్తాయని ఆయా పార్టీల నాయకులు సమావేశాలు నిర్వహిస్తూ, సమీకరణలు మొదలుపెట్టారు. ఇప్పటికే చాలా గ్రామాలలో వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల జాబితా దాదాపుగా ఖరారైంది.

ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు పెద్ద పరీక్షే .. సత్తా చాటాలని సర్వ శక్తులు ఒడ్డుతున్న పార్టీలు
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని టిడిపి వ్యూహాలు రచిస్తుంది . ఈ ఎన్నికల్లోనూ విజయ బావుటా ఎగురవేసి, అన్ని గ్రామాలలోనూ వైసీపీదే విజయం అని ప్రతిపక్షాలకు చూపించాలని అధికార వైసిపి ప్రయత్నాలు చేస్తుంది . ఈ ఎన్నికల్లో పుంజుకోవాలని, తమ బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ , జనసేన లు, ఈ ఎన్నికల్లో నైనా కాస్త వెలుగులోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, తమకు ఉన్న స్థానాలలో పట్టు కోల్పోకుండా కాపాడుకోవాలని కమ్యూనిస్టులు ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. సత్తా చాటాలని సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి పార్టీలు .

గ్రామాలలో పట్టున్న వారిని అభ్యర్థులుగా బరిలోకి దించాలని ప్లాన్
ఈనెల 29వ తేదీ నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కానుంది. దీంతో నేడు, రేపట్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాలను అభ్యర్థుల పేర్ల జాబితా కొలిక్కిరానుంది. ప్రధాన పార్టీలన్నీ గ్రామాలపై దృష్టి సారించి, గ్రామాలలో పట్టున్న వారిని అభ్యర్థులుగా బరిలోకి దించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటుతామని, వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలు వైసీపీకి విజయాన్ని చేకూరుస్తాయని అధికార పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు.

గెలిచేది ఎవరో ? గ్రామాల్లోని ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో
ఇదే సమయంలో ప్రజలు జగన్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, జగన్ పాలన పట్ల ఉన్న అసంతృప్తి తమకు ఓటు బ్యాంకుగా మారుతుందని ప్రతిపక్ష పార్టీలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇక రాష్ట్ర రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తున్న ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసి గెలిపించాలన్న దానిపై గ్రామాల స్థాయిలో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.
అధికార పార్టీ సంక్షేమ పథకాలకు ఫిదా అవుతారా ? లేకా అధికార వైసీపీపై విముఖత ప్రదర్శిస్తారా ? అన్నది వేచి చూడాల్సిందే .