ఏలూరు మిస్టరీ వ్యాధికి కారణమిదే -జగన్ చేతికి ఎయిమ్స్, ఐసీటీ రిపోర్టులు -సీఎం కీలక ఆదేశాలు
అంతర్జాతీయంగా సంచలనం రేపిన ఏలూరు అస్వస్థలపై మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. అయితే అంతుచిక్కని వ్యాధికి దారి తీసిన కారణాలు మాత్రం తేటతెల్లమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన మిస్టరీ వ్యాధి గుట్టును ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలు బయటపెట్టాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతికి బుధవారం రిపోర్టులు అందగా, వెంటనే ఆయన వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేసి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.
జగన్‌కు బీజేపీ అనూహ్య సవాల్ -చర్చిల నుంచి వసూళ్లు -సోము వీర్రాజు సంచలనం -పవన్ ఫ్యాక్టర్

మిస్టరీ వ్యాధికి కారణాలివే..
ఏలూరులో వింత వ్యాధికి పురుగుమందుల అవశేషాలే కారణమని ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు తేల్చి చెప్పాయి. సీఎం జగన్ అభ్యర్థన మేరకు తాము జరిపిన అధ్యయం, పరిశోధనలపై రూపొందించిన రిపోర్టులను ఈ మేరకు బుధవారం ఏపీ ప్రభుత్వానికి అందజేశాయి. అయితే..


కారణం సరే, కార్యం ఎలా?
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఈనెల 5న ఒక్కసారిగా అంతుచిక్కని వ్యాధి ప్రబలి, గంటల వ్యవధిలోనే వందల మంది అస్వస్థతకు గురయ్యారు. ఫిట్స్, వాంతులు, వికారం, పొత్తికడుపులో నొప్పి తదితర లక్షణాలతో జనం ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటివరకు 615 మంది మిస్టరీ వ్యాధికి గురికాగా, అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాగా, బుధవారం వెల్లడైన ఎయిమ్స్, ఐసీటీ రిపోర్టుల్లో వ్యాధికి.. పురుగుమందుల అవశేషాలే కారణం అని చెప్పారుగానీ, సదరు విషం మనుషుల్లోకి ఎలా ప్రవేశించిందనే విషయాన్ని మాత్రం తేల్చలేకపోయారు. పురుగుమందుల అవశేషాలు మనుషుల శరీరాల్లోకి ఎలా ప్రవేశించాయన్నదానిపై దీర్ఘకాలంలో మరిన్ని అధ్యయనాలు అవసరమని రిపోర్టులో పేర్కొనడం గమనార్హం. వీటిపై..

సీఎం కీలక ఆదేశాలు
ఏలూరు మిస్టరీ వ్యాధిపై ఎయిమ్స్, ఐసీటీ రిపోర్టులు చేతికందిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మనుషుల శరీరాల్లోకి పురుగుమందుల అవశేషాలు ప్రవేశించాయన్నదానిపై దీర్ఘకాల అధ్యయనం అవసరమన్న నిపుణుల సూచనల మేరకు.. ఏలూరులో క్రమం తప్పకుండా అన్ని రకాల ఆహారాలు, నీటిని పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పశ్చిమగోదావరితోపాటు అన్ని జిల్లాల్లోనూ ల్యాబులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

పురుగుమందుల వాడకం తగ్గాలి..
ల్యాబ్ లను ఏర్పాటు చేసిన తర్వాత క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు.వాటి ఫలితాలు ఆధారంగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎస్‌కు సూచించారాయ. ఏలూరు తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఏలూరు విపత్తుకు పురుగుమందులే కారణమని స్పష్టమైపోయిన నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో వాటి వాడకాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, రైతు భరోసా కేంద్రాల ద్వారా సేంద్రీయ పద్ధతులు, సేంద్రీయ వ్యవసాయానికి పెద్దపీట వేయాలని సీఎం జగన్ అన్నారు.

కొత్త కేసులు లేవు.. ఫ్రీ ఏలూరు
ఏలూరు వింత వ్యాధికి సంబంధించి గడిచిన 72 గంటల్లో కొత్త కేసులేవీ నమోదుకాలేదు. దీంతో ‘ఫ్రీ ఏలూరు'గా ప్రకటన చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరణించిన ఇద్దరు తప్ప వ్యాధి బారినపడ్డ 615 మందిలో ఇప్పటికే చాలా మంది డిశ్చార్జ్ అయిపోవడంతో ఏలూరులో వైద్య శిబిరాలను కూడా ఎత్తివేశారు. సీఎం ఆదేశాలతో ల్యాబ్ లను ఏర్పాటు చేసి ఇక్కడి ఆహార, నీటి, మట్టి నమూనాలను ఎప్పటికప్పుడు పరీక్షించనున్నారు. అదే సమయంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.