సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామాకి...కారణం ఇదా?
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీనారాయణ ఈ కారణంతో పదవీ విరమణ చేస్తున్నారంటే...కాదు ఈ రీజన్ తోనే అంటూ రాష్ట్రంలో సర్వత్రా చర్చ జరుగుతోంది...ఇక మరోవైపు చిన్న విషయంపైనే ఎనాలిసిస్ ల మీద ఎనాలసిస్ లు చేసే నెటిజన్ మేధావులు ఇంత కీలకమైన విషయంపైనే స్పందించకుండా ఉంటారా?...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం, వీఆర్ఎస్: రాజకీయాల్లోకి.. ఏ పార్టీ వైపు?
అందుకే ఆ మహా మేధావులు కూడా ఈ విశ్లేషణల్లో తలో చెయ్యి వేసేస్తున్నారు. అయితే వీటన్నింటి కంటే ముందు అసలు సిబిఐ మాజీ జెడి తను స్వచ్చంద పదవీ విరమణ చేయడానికి కారణం ఏంటో చెప్పే ఉంటారుగా!...మరి ఆ రీజనేంటో తెలుసుకుందాం...ఆ తరువాత ఆయన చెప్పిన కారణాన్ని అంగీకరిస్తారా?...లేక ఈ విశ్లేషణల్లో ఏదైనా నిజమా మీరే నిర్ణయించుకోవచ్చు...తన విఆర్ఎస్ కు సిబిఐ మాజీ జెడి చెబుతున్న కారణం ఇది.

అసలు లక్ష్మీనారాయణ...ఇప్పుడు ఎక్కడంటే?
ఎపిలో సంచలనం సృష్టించిన వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్‌రెడ్డి మైనింగ్ కేసుల వ్యవహారంతో పాటు సత్యం కంప్యూటర్స్ కేసు అప్పటి సీబీఐ జెడి లక్ష్మీనారాయణ అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ ఆఫీసర్ అయిన లక్ష్మీ నారాయణ 2006 లో డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ సిబిఐ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా నియమించబడ్డారు. ఆ తరువాత తను సొంత క్యాడర్ మహారాష్ట్రకు ట్రాన్స్ ఫర్ అయిన ఆయన ఇప్పుడు అక్కడ ఆ రాష్ట్రానికి అడిషనల్ డీజీగా పనిచేస్తున్నారు.

లక్ష్మీనారాయణ విఆర్ఎస్...అత్యంత సంచలనం
అయితే ఉన్నట్టుండి ఈ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవటం తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తన విఆర్ఎస్ దరఖాస్తును అనుమతించాలని కోరుతూ ఆయన మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. అయితే ఆయన హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని ప్రతిఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. దీంతో లక్ష్మీనారాయణ విఆర్ఎస్ అంశం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంతకీ లక్ష్మీనారాయణ...ఏమంటున్నారంటే
ఇంతకీ అసలు తాను విఆర్ఎస్ తీసుకోవడానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కారణం ఏమని చెబుతున్నారంటే...కేంద్ర ప్రభుత్వం తనను లూప్-లైన్ పోస్టుకు బదిలీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారని తెలిసింది. అయితే ఇప్పుడు లక్ష్మీ నారాయణ చెబుతున్నఈ కారణం కూడా కేంద్రానికి వ్యతిరేకంగానే ఉండటంతో ఆయన రాజకీయ రంగప్రవేశంపై ఊహాగానాలు బలం పుంజుకున్నాయి. అదీ ఎపిలో రాజకీయ పరిస్థితులు కేంద్రానికి, రాష్ట్రానికి వైరం కొనసాగుతున్న సమయంలోనే ఈ సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ ఇలా విఆర్ఎస్ తీసుకోనుండటం...అందులో ఆయన కేంద్రం వైఖరికి నిరసనగా విఆర్ ఎస్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారనడం ఇక ఆయన రాజకీయ రంగ ప్రవేశం తధ్యమనే ప్రచారానికి ఊతం ఇస్తోంది.

ఏ రాజకీయ పార్టీలో...చేరే అవకాశం ఉందంటే...
అయితే ఈ సిబిఐ మాజీ జెడి డీల్ చేసిన రెండు ప్రధాన కేసులు ఒకటి వైసిపి అధినేత జగన్ కు, మరోటి బిజెపి నేత గాలి జనార్థన్ రెడ్డికి చెందినవి కావడంతో ఈ సహజంగా ఈ రెండు పార్టీల్లో ఆయన చేరే అవకాశం ఉండదు. పైగా ఈ కేసుల ద్వారా టిడిపికి పరోక్షంగా రాజకీయ లబ్ది పొందేందుకు అవకాశం ఏర్పడటంతో ఆయనను టిడిపి అనుకూలుడు గానే వైసిపి,బిజెపి అభిమానులు భావిస్తున్నారు. పైగా ఇటీవలి కాలంలో ఈయన ఎపి డిజిపి గా కూడా రానున్నారని బలంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ పరిణామంతో దీంతో ఈయన పై టిడిపికి మంచి గురి ఉందనే అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుండటం, ఈ ఆఫీసర్ కారణంగానే అవినీతి కేసుల్లో వైసిపి కీలక నేతలు జైలుకు వెళ్లడం సంభంవించడం, అయితే అదే వైసిపి నేతలు ఇప్పుడు చంద్రబాబు జైలుకు వెళతారంటూ విమర్శలు చేస్తుండటం...ఇలాంటి సమయంలో ఈ అధికారి రాజీనామా చేస్తుండటంతో ఒకేసారి ఇటు బిజెపికి...అటు వైసిపికి గట్టి షాక్ ఇచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ఈ అధికారిని రాజకీయాల్లోకి రప్పిస్తున్నారనేది కొందరు రాజకీయ పరిశీలకుల విశ్లేషణ...కేవలం కొద్ది రోజులు ఆగితే ఈ విషయంలో అందరికీ స్పష్టత రానున్నందున అప్పటి దాకా వెయిట్ అండ్ సీ!