నాపై లేని ఆరోపణలు చేస్తే...: ఆపరేషన్ గరుడపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

విజయనగరం: తాను ఏ పార్టీతోను టచ్‌లో లేనని, కేవలం ప్రజలతోనే టచ్‌లో ఉన్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బుధవారం వెల్లడించారు. ఆయన జనసేనలోకి వెళ్తారని గతంలో ప్రచారం జరిగింది. ఇటీవల ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే ఆరెస్సెస్ వేరు, పార్టీలు వేరు అని చెబుతున్నారు. ఇతర పార్టీలోకి వెళ్లే ప్రచారంపై స్వయంగా ఆయన స్పందించారు.
ఏ రాజకీయ పార్టీతోను తాను లేనని తేల్చి చెప్పారు. ఆయన విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం టి బూర్జవలస గ్రామసభలో మాట్లాడారు. బీజేపీతో తాను టచ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నానని, వాటిని పరిష్కరించేందుకే గ్రామాల్లో పర్యటిస్తున్నానని చెప్పారు.
స్పీకర్ ఓకే: 5గురు వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం! బుట్టా రేణుక-కొత్తపల్లి గీతపై ఫిర్యాదు

ఆపరేషన్ గరుడపై స్పందన
ఇటీవల నటుడు శివాజీ, టీడీపీ నేతలు ఆపరేషన్ గరుడ అని బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు. దక్షిణాదిపై ఆపరేషన్ గరుడ ప్లాన్‌తో వచ్చారని చెబుతున్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు లక్ష్మీనారాయణను ప్రశ్నించారు. దానికి ఆయన స్పందించారు.
తనకు ఆపరేషన్ గరుడ అంటే ఏమిటో తెలియదన్నారు. తనకు తెలిసిందల్లా అబ్దుల్ కలాం గారు చెప్పిన గరుడ గురించి మాత్రమే అన్నరు. ఆయన చెప్పినట్టు గరుడ పక్షిలాంటి దృక్పథం అలవరచుకోవాలని మాత్రమే తనకు తెలుసునని చెప్పారు.

నాపై లేనిపోని ఆరోపణలు చేయవద్దు
ఏ పార్టీతో సంబంధం లేదని, ఎవరితో సంబంధం లేని తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని లక్ష్మీనారాయణ అన్నారు. ఇప్పటి వరకు అసత్య ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. సామాజిక వర్గం గురించి తాను ఎప్పుడు ఆలోచించనని చెప్పారు. గడప దాటి బయటకు వచ్చిన తర్వాత సమాజమే తన వర్గమని, సామాజిక వర్గం అనే ఆలోచన నుంచి బయటపడితేనే సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు.

ప్రజాధరణ సైడ్ ఎఫెక్ట్ లాంటిది
సమస్యలు పరిష్కారమై ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు లక్ష్మీనారాయణ చెప్పారు. తాను ఏం చేసినా చిత్తశుద్ధితో చేస్తానని చెప్పారు. ప్రజాధరణ కోసం తాను ఎప్పుడూ పని చేయనని, పాకులాడనని తెలిపారు. ప్రజాదరణ అనేది సైడ్ ఎఫెక్ట్ లాంటిది అన్నారు. తాను పాపులారిటీ కోసం పని చేస్తున్నానని చెప్పే వారి దృక్పథం అలాంటిదన్నారు. భయం నుంచి వారు అలా మాట్లాడుతున్నారన్నారు.

చంద్రబాబు స్పందించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి స.హ.చట్టం కమిషనర్లను తక్షణమే నియమించాలని లక్ష్మీనారాయణ అన్నారు. సముద్ర తీర ప్రాంతంలో గల మత్స్యకారులకు జెట్టీలు ఏర్పాటు చేయాలన్నారు. వీరికి డీజిల్ రాయితీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గల కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, బుధవారం రాత్రి కృష్ణాపురంలో ఆయన పర్యటించారు. గ్రామస్తులు కోలాటం ఆడి ఆహ్వానం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

రైతులను రాజును చేసేందుకే వచ్చా
భారతదేశం కళలకు పుట్టినిల్లని, ఇతర దేశాలు మన కళలను చూసి మెచ్చుకుంటున్నాయని లక్ష్మీనారాయణ చెప్పారు. అంతరించిపోతున్న కోలాటం, తప్పెటగుళ్లు కళాకారులకు గుర్తింపు కార్డులు, పింఛన్లు, సామగ్రి అందించాలన్నారు. విజయనగరం జిల్లాలో సుమారు పదివేల మంది కళాకారులున్నారని తెలిసిందన్నారు. వీరిని ఆదుకోవడానికి తమవంతుగా సంబంధిత అధికారులతో మాట్లాడతానన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించి రాజును చేయడానికే ఉద్యోగాన్ని వదిలి సామాజిక సేవా కార్యక్రమాల వైపు వచ్చానన్నారు.