లోకల్ మాఫియాతో పోలీసుల దోస్తీ.. వైసీపీ ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు వ్యవహారిస్తున్న తీరుపై ఆసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కంటే నక్సలిజం, టెర్రరిజం తగ్గిందన్నారు. కానీ లోకల్ మాఫియా మాత్రం పేట్రేగిపోతుందని పేర్కొన్నారు. ఈ మాఫియాతో పోలీసుశాఖ వాళ్లు కూడా కలిసిపోయారంటూ బాంబ్ పేల్చారు.

లోకల్ మాఫియాతో పోలీసులకు లింకులు
నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పోలీసుశాఖ పనితీరుపై ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం లోకల్ మాఫియా ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మాఫియాలు ఇప్పుడే కాదని, గత ప్రభుత్వంలోనూ ఉన్నాయన్నారు. వీళ్లు ప్రజలకు గుదిబండలా తయారయ్యారన్నారు. ఈ మాఫియాల్లో పోలీసుశాఖ వాళ్ల ఇన్వాల్వ్ మెంటు కూడా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సామాన్యులకు భద్రతేది..
లోకల్ మాఫియాతో చేతులు కలిపితే పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్నారు ఆనం. ఇప్పటికే పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం , భరోసా ఉందని పేర్కొన్నారు. అలాంటిది పోలీసులే మాఫియాతో కలిస్తే సామాన్యులకు భద్రతేమి ఉంటుందని రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలంటే కలుపు మొక్కలను ఏరిపారేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఆనంలో అసంతృప్తి ?
ఆనం కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యులు చేశారు. ఆయనను సస్పెండ్ చేసేందుకు కూడా సీఎం జగన్ సిద్దమయ్యారని లీకులు కూడా ఇచ్చారు. కానీ తర్వాత అంతా సర్ధుమనిగింది. ప్రస్తుతం పార్టీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టేసింది అని టాక్. వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ప్రోత్సహిస్తోందని సమాచారం.. మరి ఆనం తాజాగా వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దల రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి..