ఏపీ ఈఎస్ఐ స్కాం: అచ్చెన్నకు మనీ చేరలేదు కానీ, ఈ-టెండర్ పిలవకపోవడంతోనే: ఏసీబీ డీజీ
ఏపీలో వెలుగులోకి వచ్చిన ఈఎస్ఐ స్కాం విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మందులు, పరికరాల కొనుగోళ్లలో ఈ-టెండర్ పిలువకపోవడంతో జరిగిన అవినీతిపై ఏసీబీ విచారిస్తోంది. విచారణ తీరును ఏసీబీ డీజీ రవికుమార్ వెల్లడించారు. విచారణ పూర్తి అయితే తప్పు చేసింది ఎవరో బయటపడతారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మొత్తం 19 మంది పాత్రను గుర్తించామని.. మాజీమంత్రి అచ్చెన్నాయుడు, ఈఎస్ఐ డైరెక్టర్ రమేశ్ కుమార్ సహా 12 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. మరో ఏడుగురిని అదుపులోకి తీసుకుంటామని వివరించారు.
మొన్న అచ్చెన్న, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి..కరోనా అంటించింది జగన్ సర్కారే:చంద్రబాబు, లోకేశ్ నిప్పులు

నగదు తీసుకున్నట్టు ఆధారాలు లభించలేదు.. కానీ
వైద్య పరికరాలు, మందుల కొనుగోలు కుంభకోణంలో డీలర్ల నుంచి మాజీమంత్రి అచ్చెన్నాయుడికి నగదు తీసుకున్నట్టు దర్యాప్తులో ఎక్కడా ఆధారాలు లభించలేదని ఏసీబీ డీజీ తెలిపారు. కానీ విచారణ సమయంలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయని మాత్రం చెప్పారు. పలు కంపెనీలు మంత్రి వద్దకు వస్తుంటాయని.. ఆ సమయంలో అధికారులకు సిఫారసు చేయవచ్చు... కానీ వాటిని అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులకు ఛాన్స్ ఇవ్వాలన్నారు. కానీ ఆ కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలని అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో కుంభకోణం జరిగి ఉంటుందని తెలిపారు.

ఈ-టెండర్ వెళ్లకపోవడంతో అనుమానాలు
టెండర్‌కు వెళ్లాల్సిన వాటికి సంబంధించి ఈ విధంగా వ్యవహరించొద్దు అని ఏసీబీ డీసీ తెలిపారు. అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీచేయడంతోనే.. ఆయనతోపాటు ఈఎస్ఐ డైరెక్టర్ రమేశ్‌కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడి పాత్రపై ఆధారాలున్నాయని ఏసీబీ డీజీ తెలిపారు. 2016-19లో ఈఎఎస్ఐ వైద్య పరికరాలు, మందులు, టెలి మెడిసన్ సేవలలపై ఈ-టెండర్లు నిర్వహించకుండా రూ.975 కోట్లతో కొనుగోలు చేశారన్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.150 కోట్లు నష్టం వచ్చిందని చెప్పారు.

రూ.లక్ష దాటితే తప్పనిసరి.. కానీ..
వాస్తవానికి లక్ష రూపాయలకు ఎక్కువ గల వస్తువులు/పరికరాలు కొనుగోలు చేయాలంటే ఈ-టెండర్ పిలవాలి. రూ.వందల కోట్ల కొనుగోళ్లలో ఈ-టెండర్ పిలువకపోవడం.. కేటాయించిన నిధుల కన్నా ఎక్కువ కొనుగోళ్లు చేయడంతో అవినీతి జరిగి ఉంటుందన్నారు. ఇందులో అధికారుల పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ కేసులు 19 మంది పాత్ర ఉందని గుర్తించామని.. 12 మందిని అరెస్టు చేశామని తెలిపారు. మరో ఏడుగురిని అరెస్టు చేస్తామని వివరించారు.

అడ్డగోలుగా అవినీతి..
ఈఎఎస్ఐ ఉద్యోగి ధనలక్ష్మి కుమారుడి పేరుతో, అమరావతి మెడికల్స్ వేణుగోపాల్ ఎక్కువగా మందులు సరఫరా చేశారని డీజీ రవికుమార్ తెలిపారు. రూ.4 కోట్ల మందులను కడప ఈఎస్ఐకి మందులు కొనుగోలు చేశారని.. అవి రిజిస్టర్లో ట్యాలీ కావడం లేదన్నారు. నకిలీ బిల్లులు ఎక్కువ ఉన్నట్టు దర్యాప్తులో తేలిందని చెప్పారు. టెలి హెల్త్ సర్వీసెస్‌కు సంబంధించి ప్రమోద్‌రెడ్డి, నీరజారెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు.