సీఎంకు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్: దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్‌లూ ఉంటాయి జగన్ గారూ..
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ నేత లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాలుగు రోజులుగా ప్రతీ రోజు లోకేశ్ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకొని ట్విట్టర్ ద్వారా పోస్టింగ్‌లు కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల గురించి జగన్ అసెంబ్లీలో బయటా..టీడీపీ తమ పార్టీ నుండి గెలుపొందిన 3 ఎంపీలు..23 మంది ఎమ్మెల్యేలను అక్రమంగా తమ వైపు తిప్పుకోగా.. ఇప్పుడు దేవుడు అద్బుతంగా స్క్రిప్టు రాసి అదే 3 ఎంపీలు..23 మంది ఎమ్మెల్యేలను టీడీపీకి ఇచ్చారని సెటైరికల్‌గా చెప్పుకొచ్చారు. ఇప్పుడు లోకేశ్ దీనికి కౌంటర్ ఇచ్చారు.

దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించలేదు...
లోకే్ సైతం జగన ఏ రకంగా గతంలో చెప్పారో..అదే విధంగా ఇప్పుడు ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే, జగన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు..అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు చేసిన వ్యాఖ్యలకు లోకేశ్ ఇన్ని రోజుల తరువాత కౌంటర్ ఇచ్చారు.తన ట్విట్టర్ ద్వారా..దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్‌లూ ఉంటాయి జగన్ గారూ అంటూ లోకేశ్ ప్రారంభించారు. @ysjagan గారూ! దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించలేదు...అని వ్యాఖ్యానించారు.
రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది ఫుల్స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జగన్ గత ప్రభుత్వ అవినీతి గురించి అనేక సార్లు మాట్లాడారు. తాజాగా గత ప్రభుత్వ నిర్ణయాల మీద విచారణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం ఏర్పాటు చేసారు. దీంతో..టీడీపీ ఎదురుదాడి ప్రారంభించింది. లోకేశ్ ట్వీట్ల ద్వారా జగన్‌ను లక్ష్యంగా చేసుకొని అవినీతి ఆరోపణలు కొనసాగిస్తున్నారు.

పట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్ చేయించాడు..
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తన ట్వీట్లను కొనసాగిస్తూ ..దేవుడు కామా తరువాత మళ్లీ స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టాడు...మీరు అవినీతి అన్న పట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్ చేయించాడు. అడ్డగోలన్న పోలవరం అంచనాలను యథాతథంగా కేంద్రంతో ఓకే చేయించాడు.అని పేర్కొన్నారు. అదే విధంగా.. టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే... అవి ముట్టుకుంటే షాక్ కొడతాయని కేంద్రంతో లేఖ రాయించాడు. దేవుడి స్కిప్ట్ లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయి... అంటూ ట్వీట్ చేసారు. దీనికి కొనసాగింపుగా.. భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడు. సెక్రటేరియట్లో సీఎం సీటులో కూర్చున్నప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబుగారికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకో అని స్క్రిప్ట్ లో మళ్లీ కామా పెట్టాడు. అంటూ లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి పోస్టింగ్‌లు పెట్టారు. ఇప్పుడు వీటి మీద చర్చ మొదలైంది. లోకేశ్ నేరుగా జగన్‌ను టార్గెట్ చేయటం..తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటం పైన వైసీపీ నేతలు దృష్టి సారించారు.

చంద్రబాబు సూచనల మేరకేనా..
చంద్రబాబు కుటుంబం విదేశీ పర్యటన తరువాత లోకేశ్ దూకుడు పెంచారు. తండ్రి మార్గదర్శకంలోనే లోకేశ్ పని చేస్తున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. లోకేశ్ అధికార పార్టీలోని నేతల కంటే ప్రధానంగా జగన్..విజయ సాయి రెడ్డి మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమర్ధించుకుంటూనే జగన్..విజయ సాయిరెడ్డి కేసుల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. లోకేశ్ చేస్తున్న ట్వీట్లకు విజయ సాయిరెడ్డి స్పందిస్తున్నా..జగన్ పైన చేస్తున్న కామెంట్లు..పోస్టింగ్‌లు మీద మాత్రం నేతలు అంత సీరియస్‌గా స్పందించటం లేదు. ఇక, ఇప్పుడు జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటంతో వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!