టీడీపీ సీనియర్ నేత బొజ్జల కన్నుమూత : చంద్రబాబు - కేసీఆర్ కు ఆప్తుడు : అలిపిరి ప్రమాదంలోనూ..!!
టీడీపీ సీనియర్ నేత..మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి (73) కన్నుమూసారు. కొంత కాలంగా ఆయన తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. హైదరాబాద్ లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఉదయం ఆయనకు గుండె పోటు రావటంతో వెంటనే కటుుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బొజ్జల టీడీపీ అధినేత చంద్రబాబుకు విద్యార్ధి సమయం నుంచి సన్నిహితుడుగా ఉన్నారు. చంద్రబాబు నమ్మిన బంటుగా పార్టీలో కొనసాగారు. టీడీపీ హయాంలో పలు శాఖలకు మంత్రిగానూ పని చేసారు.

గుండెపోటుతో బొజ్జల కన్నుమూత
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి అయిదు సార్లు బొజ్జల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2003, అక్టోబర్ 1న చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అలిపిరి వద్ద నక్సల్స్ క్లైమోర్ మైన్స్ పేల్చిన సమయంలో..చంద్రబాబుతో పాటుగా బొజ్జల సైతం గాయపడ్డారు. బొజ్జల తండ్రి సైతం శ్రీకాళహస్తి నుంచి ఎమ్మెల్యేగా పని చేసారు. ఆయనకు ఇద్దరు సంతానం. కుమారుడు సుధీర్ రెడ్డి ఇప్పుడు శ్రీకాళహస్తి టీడీపీ బాధ్యతలు చూస్తున్నారు. చంద్రబాబుతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం బొజ్జల మంచి స్నేహితుడు.

చంద్రబాబుకు సన్నిహితుడుగా
రాష్ట్ర విభజన తరువాత 2014లో ఏపీలో చంద్రబాబు సీఎం అయిన తరువాత ఆయన కేబినెట్ లో బొజ్జల మంత్రిగా పని చేసారు. అటవీ..పర్యవరణం..సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా వ్యవహరించారు. అయితే, ఆయన అనారోగ్య కారణాలతో 2017 లో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇక, బొజ్జల అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలోనూ...ఆయన జన్మదినం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు బొజ్జల వద్దకు వెళ్లి పరామర్శించారు. ఆయనతో కొద్ది సేపు ముచ్చటించారు. బొజ్జలతో చంద్రబాబు ఆత్మీయంగా గడిపారు.

అలిపిరి ఘటన వేళ చంద్రబాబుతో
గత నెలలో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు.... బెడ్ పై ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి యోగక్షేమాలు కనుక్కున్నారు. గోపాల్ నీకేం కాదు... ధైర్యంగా ఉండు. నువ్వు తప్పకుండా కోలుకుని ఇంటికి వస్తావు. ఈసారి మీ ఇంటికి వచ్చి నిన్ను కలుస్తాను. బై గోపాల్ అంటూ ధైర్యం చెప్పారు. ఇక, ఏప్రిల్ లో బొజ్జల జన్మదినం నాడు సైతం చంద్రబాబు ఆయనను పరామర్శించారు. కొద్ది సేపటి క్రితం వరకు ఆయన ఆస్పత్రిలో సీఆర్ఆర్ ద్వారా చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నించాన..ఫలితం కనిపించలేదు.

బొజ్జల మరణంపై చంద్రబాబు సంతాపం
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం అత్యంత బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. లాయర్ గా జీవితాన్ని ప్రారంభించి.. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి శ్రీకాళహస్తి నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసిన సీనియర్ నాయకుడి అకాల మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. అణునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించేవారని కొనియాడారు. బొజ్జల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. బొజ్జల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలంటూ చంద్రబాబు సంతాపం ప్రకటించారు.