
2014లో చంద్రబాబు అనుభవం-2019లో జగన్ ఒక్క ఛాన్స్-2024లో పవన్ నినాదమేంటి ?
ఏపీలో గత కొన్నిదశాబ్దాలుగా రాజకీయాల్ని గమనిస్తే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తూనే ఉన్నారు. ఉమ్మడి ఏపీలో అయినా, విభజన తర్వాత అయినా ఓటర్ల తీర్పు స్పష్టంగానే ఉంటోంది. అయితే ఇలా స్పష్టమైన తీర్పు ఇవ్వడంలో వారిని ప్రేరేపిస్తున్న ఓ కీలక అంశం ఎన్నికల నినాదం. ముఖ్యంగా విభజన తర్వాత రాజకీయ పార్టీల అధినేతల నినాదాల ఆధారంగానే ఓటర్లు స్పందించినట్లు తేలింది. మరి 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గతంలో రెండు వేర్వేరు నినాదాలతో అధికారంలోకి వచ్చిన నేతల్ని కాదని మూడో నేతను ఎన్నుకోవాలంటే మరో నినాదం తప్పనిసరి.

అనుభవం పేరుతో 2014లో చంద్రబాబు
2014లో ఏపీ విభజన తర్వాత అప్పట్లో విపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్నికల్లో అనుభవం పేరుతో ఎన్నికలకు వెళ్లారు. విభజనతో నష్టపోయిన ఏపీని అభివృద్ధి చేయాలంటే రాజకీయాల్లో చంద్రబాబుకు ఉన్న విశేష అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని టీడీపీ బలంగా ప్రచారం చేసింది. జనం కూడా అదే నమ్మారు. దీంతో అప్పట్లో చంద్రబాబు 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి సునాయాసంగా అధికారం చేపట్టారు. చంద్రబాబు ఐదేళ్ల పాలన తర్వాత అనుభవం నినాదానికి ఫుల్ స్టాప్ పడింది.

2019లో జగన్ ఒక్కఛాన్స్ నినాదం
2019 నాటికి చంద్రబాబు అనుభవం ఏమాత్రం రాష్ట్రానికి ఉపయోగపడలేదని, ఒక్క ఛాన్స్ ఇస్తే తాను తన తండ్రి వైఎస్సార్ ను మించిన సంక్షేమ పాలన అందిస్తానని వైసీపీ అధినేతగా ఉన్న జగన్ ప్రజల్లోకి వెళ్లారు. దీంతో అప్పటికే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారంతా సరే జగన్ కు ఒక్క ఛాన్స్ ఇద్దామని భావించారు. వీరి సంఖ్య ఎన్నికల నాటికి భారీగా పెరగడంతో జగన్ భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టారు. అధికారంలోకి వచ్చాక చెప్పినట్లుగానే సంక్షేమంపైనే ఆయన దృష్టిపెట్టారు. అయితే ప్రతీ ఎన్నికల్లోనూ ఏదో ఒక నినాదాన్ని ఆదరిస్తున్న ఏపీ ఓటర్లు 2024లో ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది.

పవన్ ప్రత్యామ్నాయం కాగలరా ?
వరుసగా రెండు ఎన్నికల్లో చంద్రబాబు, వైఎస్ జగన్ కు రెండు నినాదాలతో అధికారం కట్టబెట్టిన ఏపీ ప్రజలు.. 2024లో ఏ నినాదాన్ని ఆదరించబోతున్నారు ? ఏ పార్టీకి అధికారం కట్టబెట్టబోతున్నారనే ఉత్కంఠ ఇప్పటినుంచే పెరుగుతోంది. దీనికి రాజకీయ పార్టీలు చేస్తున్న హడావిడే కారణం. అయితే గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ ను వారి నినాదాలతో ఆదరించిన జనం.. ఈసారి ప్రత్యామ్నాయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఆదరించాలంటే ఆయన ఏ నినాదం ఎత్తుకోవాలనే దానిపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. గతంలో పోపిస్తే ఇప్పుడున్న పరిస్ధితుల్లో విపక్షాలకు ఏ ఒక్క ఛాన్స్ దొరక్కుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్న జగన్ ను ప్రజలు వద్దనుకుంటే మాత్రం చంద్రబాబు, పవన్ లో ఒక్కరికి లేదా ఇద్దరు కలిసున్న కూటమికి అధికారం దక్కుతుంది. అలా జరగాలంటే ప్రత్యామ్నాయ నినాదం ఏదనే దానిపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. మరోవైపు ఇప్పుడు చంద్రబాబు కాస్తో కూస్తో జగన్ కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నా పవన్ మాత్రం ఆ రేంజ్ లో యుద్ధం చేసే పరిస్ధితి లేదనే వాదన వినిపిస్తోంది.

పవన్ నినాదం ఇదేనా ?
2024 ఎన్నికల్లో విపక్షాలను వైసీపీకి వ్యతిరేకంగా ఏకం చేస్తానని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఈసారి అభివృద్ధి నినాదం అందుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబుతో కలిసి అభివృద్ధి పాలన అందిస్తామని నినదించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ మూడేళ్ల పాలనలో అభివృద్ధి లేమి కనిపిస్తోంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్ధితిపై పొరుగు రాష్ట్రాల నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. అన్ని రంగాల్లోనూ సమస్యలు కనిపిస్తున్నాయి. దీంతో వీటన్నింటినీ పరిష్కరించేలా అభివృద్ధి పాలన అందిస్తామని పవన్ జనంలోకి వెళ్తారని భావిస్తున్నారు. బీజేపీ, టీడీపీలతో పొత్తుంటే మోడీ-చంద్రబాబు అభివృద్ధి మోడల్ పేరుతో జనసేన జనంలోకి వెళ్లబోతోందని తెలుస్తోంది. కేవలం టీడీపీతో పొత్తున్నా గతంలోలా చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే నినాదం వినిపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.