దుర్గమ్మ దర్శనానికి వెళ్ళిన నిజామాబాద్ కు చెందిన కుటుంబం విజయవాడలో ఆత్మహత్య; కారణాలివే!!
విజయవాడలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. నిజామాబాద్ కు చెందిన కుటుంబం దుర్గమ్మ దర్శనానికి వెళ్లి అక్కడ కన్యకా పరమేశ్వరి సత్రంలో విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకోగా, తండ్రి మరో కొడుకు కృష్ణా నదిలో దూకి ప్రాణాలు వదిలారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపుల కారణంగా అప్పుల బాధ భరించలేక కుటుంబం ప్రాణాలు వదిలినట్లుగా తెలుస్తుంది.

ఆత్మహత్య చేసుకునే ముందు బంధువుకు మెసేజ్ పెట్టిన ఫ్యామిలీ
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ నుంచి పప్పుల సురేష్ కుటుంబం దుర్గమ్మ దర్శనానికి విజయవాడకి వచ్చారు. విజయవాడ నగరంలోని వన్ టౌన్ లో ఉన్న కన్యకా పరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్ పేరుతో కుటుంబం ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. శనివారం రోజు తెల్లవారుజామున 2.30 నిమిషాల ప్రాంతంలో తాము అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు గా బంధువుకు మెసేజ్ పెట్టారు.

విషం తాగి సత్రంలోనే తల్లి, కొడుకు మృతి
మెసేజ్ చూసిన బంధువు వెంటనే కన్యకా పరమేశ్వరి సత్రం నిర్వాహకులకు ఫోన్ చేసి వారిని కాపాడవలసిందిగా చెప్పగా, రమేష్ కుటుంబం ఉన్న రూమ్ కి వెళ్ళిన కన్యకా పరమేశ్వరి సత్రం నిర్వాహకులు అప్పటికే గదిలో విగతజీవులుగా పడి ఉన్న తల్లి కొడుకు శవాలను చూశారు. ఆ గదిలో కొన్ని మందులను కూడా వారు గుర్తించారు. వారు విషం తీసుకుని మృతి చెందినట్టు గుర్తించారు.

తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య
తండ్రి మరో కుమారుడు కృష్ణా నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయలుదేరి వచ్చిన సురేష్ కుటుంబం ఈరోజు తెల్లవారుజామున బలవంతంగా ప్రాణాలు తీసుకుని తనువు చాలించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబంలోని మృతులు పప్పుల సురేష్, పప్పుల శ్రీలత, పప్పుల ఆశిష్, అఖిల్‌గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పుల బాధ భరించలేక, అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న విజయవాడ పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

అప్పుల బాధ, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపులతో నిర్ణయం
ఇదిలా ఉంటే నిజామాబాద్ లోని గంగస్తాన్ ఫేస్ 2కి చెందిన సురేష్ కుటుంబం ఆర్థికంగా చితికి పోవడంతో ఇంటి లోన్ కట్టలేదని వారి ఇంటిని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు సీజ్ చేశారు. గత ఆరు నెలలుగా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ తో పాటుగా పలువురు నుంచి ఈ కుటుంబం వేధింపులను ఎదుర్కొంటోంది. సురేష్ కుటుంబానికి అప్పుల వాళ్ళ వేధింపులు నిత్యకృత్యంగా మారింది. ప్రతి రోజూ ఇంటికి అప్పులవాళ్ళు వచ్చి వెళ్లి వెళ్ళే వాళ్ళని స్థానికులు చెబుతున్నారు.

విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం
రెండు రోజుల క్రితం సురేష్ కొడుకు అఖిల్ నడిపిస్తున్న పెట్రోల్ బంక్ లోకి కూడా వెళ్లి కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక విజయవాడ వెళ్లిన తర్వాత ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వారి ఇంటిని సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకేసారి అప్పల వాళ్లంతా మూకుమ్మడిగా వేధింపులకు పాల్పడడంతో దిక్కుతోచని స్థితిలో అవమానభారంతో కుటుంబంలోని అందరూ విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విజయవాడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.