
అమ్మో సీఐడీ కస్టడీనా ! వద్దు మా ఇంట్లో విచారించమన్న రఘురామ- సేఫ్ ప్లేస్ చూడమన్న హైకోర్టు
ఏపీలో వైసీపీ తరఫున ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత ఆ పార్టీతో విభేదిస్తూ దాదాపు మూడేళ్లుగా విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును విద్వేష వ్యాఖ్యల కేసులో గతంలో ప్రభుత్వం అరెస్టు చేసింది. రాజద్రోహం కేసులు పెట్టింది. సీఐడీ పోలీసులు కస్టడీలో రఘురామను కొట్టినట్లు సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది. అయితే రాజద్రోహం కేసుల్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో ఇతర సెక్షన్ల కింద విచారణకు సిద్దమవుతున్న సీఐడీకి రఘురామ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

సీఐడీ కస్టడీలో రఘురామపై వేధింపులు
ఏపీలో రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై గతంలో సీఐడీ రాజద్రోహం సహా పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో విచారణ కోసం గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు.. ఆయన్ను కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల దెబ్బలకు తన కాళ్లు కమిలిపోయాయని రఘురామ అప్పట్లో ఆరోపించడం సంచలనం అయింది. అయితే వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వాటిని ప్రాధమికంగా నిర్ధారించింది. దీంతో రఘురామకు బెయిల్ కూడా ఇచ్చింది.

మళ్లీ విచారణకు రఘురామ
గతంలో రాజద్రోహం సహా ఇతర కేసుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించి షరతులతో బెయిల్ పొందిన రఘురామరాజును తిరిగి సీఐడీ విచారించలేదు. ఆ లోపే సీఐడీ నమోదు చేసిన కేసులన్నీ కొట్టేయాలంటూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. సీఐడీకి నోటీసులు పంపింది. దీంతో రఘురామపై విచారణ ఇంకా పూర్తి కాలేదని, సుప్రీంకోర్టు ఆయనకు షరతులతోనే బెయిల్ ఇచ్చిందని సీఐడీ హైకోర్టు దృష్టికి తెచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది.

ఇంట్లోనే విచారించాలన్న రఘురామ
గతంలో సీఐడీ కస్టడీలో తనపై జరిగిన దాడుల్ని సుప్రీంకోర్టు కూడా ప్రాధమికంగా నిర్ధారించిన నేపథ్యంలో మరోసారి సీఐడీ కస్టడీకి తనను పంపవద్దని హైకోర్టును రఘురామ కోరారు. తనను హైదరాబాద్ లోని ఇంట్లో విచారించాలని హైకోర్టును కోరారు. సీఐడీ కస్టడీకి పంపితే మళ్లీ దాడి జరిగే అవకాశాలున్నాయని ఆయన కోర్టుకు తెలిపారు. హైదరాబాద్ లోని ఇంట్లో సీఐడీ విచారణ జరిపితే ఎంపీ రఘురామ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన లాయర్ హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు దీనిపై స్పందించింది.

సేఫ్ ప్లేస్ చూడాలన్న హైకోర్టు
సీఐడీ కస్టడీ విచారణలో గతంలో రఘురామరాజుకు ఎదురైన అనుభవాలు, తాజాగా హైదరాబాద్ ఇంట్లోనే తనను విచారణ జరపాలని ఆయన చేసిన వినతిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రఘురామరాజును విచారించేందుకు సురక్షితమైన చోటు గుర్తించాలని సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. అయితే సీఐడీ దీనిపై అభ్యంతరాలు తెలిపింది. రఘురామపై రాజద్రోహం మినహా ఇతర కేసుల్లో విచారణ జరపాల్సి ఉందని, రోజువారీ విచారణ ఎంపీ ఇంట్లో చేయడం కుదరదని తెలిపింది. అయితే హైకోర్టు మాత్రం ఇరుపక్షాల ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చెబుతూ సేఫ్ ప్లేస్ వెతకాలని సీఐడీకి సూచించింది.