మూడు రాజధానులపై నేటి నుంచి ఏపీ హైకోర్టు తుది విచారణ- బిల్లుల భవిష్యత్తు తేల్చేస్తారా ?
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం తుది అంకానికి చేరుతోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన వందకు పైగా పిటిషన్లపై విచారణ సాగుతోంది. ఇందులో స్టే ఉత్తర్వులు కాకుండా కేవలం రాజధాని తరలింపుకు సంబంధించిన పిటిషన్లను ముందుగా విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం.. ఇవాళ్టి నుంచి తుది విచారణకు సిద్దమవుతోంది. గత నెలలో రెగ్యులర్ విచారణ జరిపిన ధర్మాసనం తిరిగి ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో ఇవాళ తుది విచారణ ప్రారంభం కాబోతోంది. ఇందులో ప్రధానంగా రాజధాని బిల్లుల ఆమోదం కోసం సాగిన ప్రక్రియే కీలకం కాబోతోంది.

తుది అంకానికి మూడు రాజధానులు..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారం మరో దశకు చేరింది. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం ఆమోదించిన రెండు బిల్లులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించేందుకు రెండు రకాలుగా హైకోర్టు ధర్మాసనం విభచించింది. ఇందులో స్టే ఉత్తర్వులు కోరుతూ దాఖలైన పిటిషన్లను పక్కనబెట్టి రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. గత నెలలో సాగిన విచారణ తర్వాత తిరిగి ఇవాళ్టికి వాయిదా పడింది. దీంతో ఇవాళ్టి నుంచి రాజధాని పిటిషన్లపై హైకోర్టు తుది విచారణ ప్రారంభించబోతోంది. ఇందుకు తగిన ఆధారాలతో రావాలని ఇప్పటికే అందరు పిటిషనర్లు, ప్రతివాదులకు గతంలోనే హైకోర్టు సూచించింది.

రెండు వారాల పాటు రోజువారీ విచారణ..
రాజధాని బిల్లులు, తరలింపు, ఇతర అంశాలపై దాఖలైన పిటిషన్లను ఇప్పటికే అంశాల వారీగా విభజించిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఇక వీటిపై రోజువారీ విచారణ చేపట్టబోతోంది. ఇవాళ ప్రధాన వాజ్యాలతో పాటు కొన్ని అనుబంధ పిటిషన్లపైనా విచారణ చేపట్టనుంది. హైబ్రిడ్ పద్ధతిలో ఈ విచారణ జరగబోతోంది. ఇవాళ్టి నుంచి ఏకధాటిగా రెండువారాల పాటు రోజువారీ విచారణ చేపట్టేందుకు హైకోర్టు ధర్మాసనం సిద్దమైంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి ప్రధాన పిటిషన్లతో పాటు అనుబంధ పిటిషన్లలోనూ అత్యధిక శాతం ఇప్పటికే విచారణ పూర్తయింది. ఇక మిగిలిన వాటిని కూడా రోజువారీ పద్దతిలో విచారించి తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు భావిస్తోంది. మరోవైపు అమరావతిలో నిర్మాణాలు, వాటి కోసం చేసిన ఖర్చు వివరాలు ఇప్పటికే హైకోర్టుకు చేరాయి. వీటిపై విచారణ కూడా కీలకం కానుంది.

విశాఖలో సీఎం గెస్ట్‌హౌస్‌పై తీర్పు..
విశాఖలో సీఎం జగన్ కోసం ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గెస్ట్‌హౌస్ కమ్ సీఎం క్యాంపు కార్యాలయంపై హైకోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. దీనిపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఈ తీర్పును ఇవాళ రేపట్లో ప్రకటించే అవకాశాలున్నాయి. అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ సీఎం గెస్ట్‌హౌస్‌లు ఏర్పాటు చేసే అంశంపైనా హైకోర్టు స్పష్టత ఇచ్చే అవకాశముంది. విశాఖకు రాజధాని తరలింపు ఆలస్యమైతే అక్కడే గెస్ట్‌హౌస్ నిర్మించుకుని పాలన సాగించేందుకు వైసీపీ సర్కారు సిద్ధమవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఈ అంశంపై ఇచ్చే తీర్పు కీలకంగా మారింది. హైకోర్టు అనుమతిస్తే సీఎం జగన్ త్వరలో విశాఖకు మకాం మార్చడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.