ఘోర ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
చిత్తూరు: జిల్లాలోని శాంతిపురం మండలం కడపల్లె వద్ద మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై కారు-లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మృతులంతా తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురికి చెందిన ఒకే కుటుంబం వారని పోలీసులు తెలిపారు. వీరంతా పలమనేరు సమీపంలోని విరూపాక్షపురం వద్ద నాటు వైద్యం కోసం వచ్చి తిరిగి తమ స్వస్థలానికి కారులో వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు వదిలారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక వృద్ధురాలు ఉన్నారు. మృతదేహాలను కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.