భారీవర్షాలు, వరదల ఎఫెక్ట్: చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో చేనేత కార్మికులు విలవిల; పనుల్లేక అవస్థలు!!
రాయలసీమ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వందలాది మంది చేనేత కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల దెబ్బకు నేతన్నల పరిస్థితి దయనీయంగా తయారైంది. వరదల దెబ్బకి పనులు లేక నేతన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత 20 రోజులుగా తమకు తాజా ఆర్డర్లు రావడం లేదని చేనేత కార్మికులు వాపోతున్నారు.

వర్షాలు, వరదల దెబ్బకు కుదేలవుతున్న నేత కార్మికులు
నెల్లూరులోని వెంకటగిరి, పాటూరు, చిత్తూరులోని నగరి సాంప్రదాయ చేతితో నేసిన కాటన్ చీరలకు ప్రసిద్ధి చెందాయి. సాధారణంగా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలోని నేత కార్మికులు కర్ణాటక, తమిళనాడు మరియు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి ముడిసరుకు తెచ్చుకుంటారు. బట్టల ఆర్డర్లు కూడా పొందుతారు.. గత 10-12 రోజులుగా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యాపారులు, మాస్టర్ వీవర్లు చేనేత కార్మికులకు కొత్త ఆర్డర్లు ఇవ్వడం మానేశారు.

వెంకటగిరిలో ఆర్డర్లు లేక వెలవెలబోతున్న మగ్గాలు
వెంకటగిరిలో సుమారు 3 వేల మగ్గాలు ఉన్నాయని, కార్మికులు నెలకు 50 వేల చీరలను నేస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యాపారులు మాస్టర్ వీవర్స్ మరియు మినీ మాస్టర్ వీవర్స్ మరియు స్టోర్ల నుండి చీరలను కొనుగోలు చేస్తారు. సాధారణంగా చీరల కొనుగోలు కోసం దేశవ్యాప్తంగా వ్యాపారులు, వినియోగదారులు వెంకటగిరికి వస్తుంటారు.
వెంకటగిరి స్థానిక వ్యాపారులు చీరల కొనుగోలు కోసం వెంకటగిరికి వచ్చే వ్యాపారులకు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. పవర్లూమ్లలో కొన్ని ముడి పదార్థాలు ఉన్నప్పటికీ, భారీ వర్షాలు మరియు వరదల కారణంగా తాజా ఆర్డర్లు లేవని దీంతో వేంకటగిరి నేత కార్మికులకు పనులు లేవని, మగ్గాలు నడవటం లేదని లబోదిబోమంటున్నారు.

దీపావళికి సరఫరా చేసిన చీరలే .. ఇప్పటివరకు మళ్ళీ ఆర్డర్లు లేవు
ఇక చేనేత కార్మికులు మినీ మాస్టర్ వీవర్ల నుంచి దాదాపు నెల రోజులుగా ఎలాంటి ఆర్డర్లు రాలేదని వాపోతున్నారు. తాము దీపావళికి చీరలు సరఫరా చేసామని, ఆ తర్వాత పని లేదని చెప్తున్నారు. భారీ వర్షాలు మా పనిపై ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ముడి సరుకుల ధరలు కూడా నెల రోజుల్లోనే పెరిగాయని చేనేత కార్మికులు చెప్తున్నారు. పాటూర్లోని దాదాపు ప్రతి ఇల్లు చేనేత, నేత లేదా వస్త్ర వ్యాపారానికి ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉంది.
పాటూర్ చీరలు చాలా వరకు సిల్క్‌తో తయారు చేయబడతాయి. కనీస డిజైన్‌తో కూడిన సాదా కాటన్ చీరలు కూడా దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ ప్రస్తుతం వర్షాలు, వరదల కారణంగా పనులు లేక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

నిత్యావసరాల కోసం కూడా అప్పులు చేస్తున్న పరిస్థితి, కరోనా తో దెబ్బ, ఇప్పుడు వర్షాలతోనూ ఎఫెక్ట్
చిల్లర వ్యాపారులు ముడిసరుకు ఇవ్వడం మానేసిన కారణంగా తమకు పనులు లేవని, ఇప్పుడు నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం కూడా ప్రయివేటు వ్యక్తుల నుంచి రుణాలు పొందాల్సి వస్తోందని వారి పరిస్థితిని చెబుతున్నారు. పండగల సమయాల్లో చీరలు నేయడానికి మాకు పెద్దమొత్తంలో ఆర్డర్లు వస్తాయి.
కరోనా ప్రభావంతో ఉగాదికి ముందే మేం పెద్ద ఆర్డర్‌ను కోల్పోయాం అని , ఇప్పుడు భారీ వర్షాలు వరదలతో పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నామని, మా దగ్గర తయారు చేసి ఉన్న చీరలను విక్రయించడానికి కూడా పక్క ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో 25 వేల చేనేత మగ్గాలు.. పనుల్లేక నేతన్నల ఇబ్బందులు
సాధారణంగా చేనేత కార్మికులు చీరలను తయారు చేసి పట్టణ ప్రాంతాల్లోని వ్యాపారులకు విక్రయిస్తారు. పాతూరు, నగరిలోని కొందరు చేనేత కళాకారులకు చీర నేయడానికి రూ.450 నుంచి రూ.550 లభిస్తుంది. చిత్తూరు జిల్లాలో 25 వేల చేనేత మగ్గాలున్నాయి. చిత్తూరులోని చేనేత, జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వర్షాల కారణంగా దెబ్బతిన్న మగ్గాల వివరాలను సేకరిస్తున్నామన్నారు. చేనేత కార్మికులకు సహాయం అందించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన వెల్లడించారు.