Sabarimala : శబరిమల క్షేత్రానికి వెళ్ళలేని భక్తుల కోసం .. ఏపీ అయ్యప్ప ఆలయాల్లో ఏర్పాట్లు
శబరిమల వెళ్ళలేని భక్తులకోసం , ఇరుముడులు సమర్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ అయ్యప్ప దేవాలయాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళుతుంటారు. అయితే ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా శబరిమలలో అమలవుతున్న కఠిన నిబంధనల మేరకు చాలా మంది భక్తులు శబరిమలకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో ప్రముఖ అయ్యప్ప స్వామి దేవాలయాలలో ఇరుముడులను సమర్పించడం కోసం ఏర్పాట్లు చేస్తామని, మాలధారులు ఎవరు ఇబ్బందులు పడవద్దని చెప్తున్నారు.
Sabarimala : శబరిమలలో కరోనా ఆంక్షల ఎఫెక్ట్ ..మొదటివారం దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇదే !!

శబరిమల వెళ్లకున్నా స్వామి పూజలు , ఇరుముడుల సమర్పణకు ఏర్పాట్లు
అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు శబరిమల వెళ్లకున్నా పర్వాలేదని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వెళ్లకుండా ఉంటేనే మంచిదని కూడా దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. అలాంటి మాలధారులకు ప్రముఖ ఆలయాలలో ఇరుముడుల సమర్పణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణాజిల్లాలో అయ్యప్ప భక్తుల కోసం దేవాదాయ శాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు . కరోనా వ్యాప్తి దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులు కరోనా కఠిన నిబంధనల మేరకు శబరిమలకు స్వామిని దర్శించుకోవడానికి వెళ్లవలసిన అవసరం లేదన్నారు .

భక్తుల కోసం ఏర్పాట్లు చేశామన్న కృష్ణా జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ
కృష్ణా జిల్లాలోని అయ్యప్ప ఆలయాలలో భక్తులు ఇరుముడులు సమర్పించడం కోసం ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. అయ్యప్ప మాలధారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
అదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలోనూ అయ్యప్ప మాల దారులు ద్వారపూడి, శంఖవరం మండలం సిద్ది వారి పాలెం లో గల అయ్యప్ప ఆలయాలలో ఇరుముడిని సమర్పించవచ్చు అని, ఈ ఆలయాలు ఆంధ్రా శబరిమలై గా గుర్తించబడ్డాయి అని చెప్తున్నారు.

ఆంధ్రా శబరిమల ఆలయాలుగా పేరున్న అయ్యప్ప ఆలయాల్లోనూ ఏర్పాట్లు
ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి మాలధారులు ఇరుముడులు సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు . శబరిమల యాత్రకు వెళ్లేందుకు వీలు కుదరని భక్తులు, ఈ ఏడాది కరోనా భయంతో శబరిమలకు వెళ్ళని భక్తులు స్థానిక అయ్యప్ప ఆలయాలలో ఇరుముడులు సమర్పించుకోవచ్చు. ఆంధ్రా శబరిమలై గా గుర్తించబడిన ఈ ఆలయాలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పశ్చిమ గోదావరి, నెల్లూరు, కృష్ణా తదితర జిల్లాల నుండి వచ్చే మాలధారులు కూడా ఇరుముడులు సమర్పిస్తారు. ఈ ఏడాది ఈ ఆలయాలలో కూడా ఇరుముడులు సమర్పించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

భక్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం
ఈ జిల్లాలలో మాత్రమే కాకుండా గుంటూరు జిల్లాలో ప్రముఖ అయ్యప్ప ఆలయాల్లో , రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అయ్యప్ప ఆలయాలలోనూ ఇరుముడులు సమర్పించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల కు వెళ్లలేని కారణంగా స్థానిక ఆలయాల లోనే వారి పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేస్తూ ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతోంది ఏపీ సర్కార్.