చరిత్రలోనే తొలిసారిగా.. తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం.. ఒక్క నెలలో ఎంతో తెలుసా!!
గతంలో ఎన్నడూ లేనివిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్న క్రమంలో స్వామి వారి ఉండి ఆదాయం భారీగా పెరిగింది. తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. మే నెలలో రికార్డు స్థాయిలో 130 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

ఒక్క నెలలోనే ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి అని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. మే నెలకు సంబంధించి ఇరవై రెండు లక్షల అరవై రెండు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అని ఆయన వెల్లడించారు. కరోనా ఇంకా తగ్గని కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నడూ లేనివిధంగా చరిత్రలో తొలిసారి ఒక్క నెలలో స్వామి వారి హుండీ ఆదాయం 130. 29 కోట్ల రూపాయలుగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈసారి లడ్డూ విక్రయాలు 1.86 కోట్ల రూపాయల మేర జరిగాయని ధర్మారెడ్డి తెలిపారు.

భక్తుల సౌకర్యం కోసం టైం స్లాట్ సర్వదర్శనం విధానాన్ని ప్రారంభించడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఇక ఇటీవల కాలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో ప్రతి రోజు స్వామివారికి హుండి ఆదాయం నాలుగు కోట్ల రూపాయలుగా ఉంటుందని చెబుతున్నారు. ఇక బాగా రద్దీ ఉండే సెలవు రోజుల్లో స్వామివారి హుండీ ఆదాయం ఐదు కోట్ల రూపాయలుగా ఉంటుందని పేర్కొన్నారు.
గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా తిరుపతి దేవస్థానానికి ఆదాయం భారీగా తగ్గింది. తిరుమలకు వచ్చే భక్తులకు కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించి, చాలాకాలంపాటు తిరుమల శ్రీవారి దర్శనాలను నిలిపివేశారు. అప్పుడు స్వామి వారి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఆపై తిరిగి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు. ఇక వేసవికాలం సెలవులు కావడంతో ప్రస్తుతం తిరుమలలో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.