ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఏపీ ఎన్జీవోల మాజీ బాస్-ఉద్యోగుల పోరు నేపథ్యంలో జగన్ నిర్ణయం
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సీపీఎస్ విధానం రద్దు, పీఆర్సీ, డీఏ, ఐఆర్ బకాయిలు వంటి విషయాల్లో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుకాకపోవడంతో ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో ప్రభుత్వానికి పెరుగుతున్న గ్యాప్ తగ్గించేందుకు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ, ఉపాద్యాయ, పెన్షనర్ల మరియు కార్మిక సంఘాల జే.ఏ.సి చైర్మన్ అయిన నలమారు చంద్ర శేఖర్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంతది. రెండు సంవత్సరాల పదవీ కాలంతో ప్రభుత్వ సలహాదారుగా (ఉద్యోగుల సంక్షేమం కొరకు) చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వ్యుల ప్రకారం చంద్ర శేఖర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా (ఉద్యోగుల సంక్షేమం కొరకు) ఇవాళ పదవీ భాద్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

చంద్రశేఖర్ రెడ్డి 36 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఉద్యోగ సంఘ నాయకుడిగా ఇటు రాష్ట్రంలోను, అటు దేశంలోనూ ఉద్యోగులకు చేసిన సేవల్ని,, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆయనను సలహాదారుగా (ఉద్యోగుల సంక్షేమం కొరకు) నియమించింది. చంద్ర శేఖర్ రెడ్డి ఇటు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు దేశ ఉపాద్యక్ష్యలుగా కుడా గతంలో పనిచేశారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వానికి తగు సలహాలు అందించడానికి ప్రభుత్వం చంద్ర శేఖర్ రెడ్డిని సలహాదారుగా నియమించింది. సమైక్య ఆంధ్ర ఉద్యమానికు ఉద్యోగుల మద్దతు ఇప్పించడంలోనూ గతంలో చంద్రశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన జైళ్ళ శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తూ ఈ ఏడాది జూన్ లో పదవి విరమణ పొందారు. కడప జిల్లాలో పుట్టి ఉద్యోగ రీత్యా హైదరాబాదుకు వచ్చి అక్కడనుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతికి తరలివచ్చారు.
ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారిధిగా ఉండి ఉద్యోగుల సమస్యలను వెంటనే తీర్చేందుకు ఈ నియామకం దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సుదీర్గకాలం పాటు ఉద్యోగ నాయకుడిగా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డికి ఉద్యోగుల్లో ఉన్న పరిచయాలు, వారి సమస్యల పై కుడా పూర్తి అవగాన ఉంది. ఈ సందర్బంగా చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకానికి తగినట్లుగా మరియు ఉద్యోగ, ఉపాద్యాయ, పెన్షనర్ల మరియు కార్మికుల సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరించుటకు నా శాయశక్తుల కృషి చేస్తానని ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేర్చుటకు కృషి చేయగలనని తెలిపారు. ఉద్యోగ, ఉపాద్యాయ, పెన్షనర్లు మరియు కార్మికులు ఏ సమస్య గురుంచి అయినా, ఎప్పుడైనా తన వద్దకు రావొచ్చని ఆయన తెలిపారు. ఉద్యోగుల న్యాయ పరమైన కోర్కెలు నెరవేరే విధంగా కృషి చేస్తానన్నారు.
అలాగే సలహాదారుగా తనను నియమించినందులకు చంద్ర శేఖర్ రెడ్డి.. సీఎం జగన్, ప్రజా భద్రతా సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, ఇతర పెద్ద్దలకు, ఉన్నతాధికారులకు, అన్ని ఉద్యోగ సంఘ నాయకులకు మరియు ఉద్యోగులందరికి కృతజ్ఞతలు తెలిపారు.