మాజీ జేడీ కొత్త పార్టీ సిద్దం - వెనుక ఉన్నదెవరు, ఎవరికి నష్టం...!!
ఏపీలో మరో కొత్త పార్టీ రానుంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నాయకత్వంలో కొత్త పార్టీ ప్రకటనకు కౌంట్ డౌన్ మొదలైంది. కొంత కాలంగా తాను విశాఖ నుంచే పోటీ చేస్తానని చెబుతున్న లక్ష్మీనారాయణ స్వతంత్రంగా లేదా కొత్త పార్టీ ద్వారా పోటీలో ఉంటానని చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే, ఈ పార్టీలో ఎవరెవరు కలిసి వస్తారు..ఈ పార్టీ ద్వారా ప్రస్తుత పార్టీల్లో ఎవరికి మేలు జరుగుతుందీ..ఎవరికి నష్టం చేస్తుందనే చర్చ మొదలైంది.
ఏపీలో కొత్త పార్టీ : ఏపీలో ఎన్నికల వేళ కొత్త పార్టీ ప్రకటనకు రంగం సిద్దమైంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఈ పార్టీ ఏర్పాటు అవుతోంది. 2019 ఎన్నికల సమయంలోనే లక్ష్మీనారాయణ పార్టీ ఏర్పాటు పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ, కొన్ని ప్రత్యేక కారణాలతో జేడీ ఆ ప్రతిపాదన అప్పట్లో విరమించుకున్నారు. ఆ ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కొంత కాలానికే జనసేన ను వీడారు. అప్పటి నుంచి విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేసారు. ప్లాంట్ కార్మికుల నిరసనల్లో పాల్గొని మద్దతు ప్రకటించారు.

పార్టీలో ఎవరెవరు : ఇక, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త పార్టీ ప్రకటనకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయన కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన వేదిక ఇప్పుడు పార్టీగా మారుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలకు భిన్నంగా కొత్త లక్ష్యాలతో పార్టీ ఉంటుందని అందులో ముఖ్య భూమిక పోషిస్తున్నారు వివరిస్తున్నారు. అయితే, లక్ష్మీనారాయణ ప్రకటించే పార్టీ కారణంగా ఏ పార్టీ ఓటింగ్ పైన ప్రభావం పడుతుంది..ఎవరికి మేలు చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్న వేళ ఒక ప్రధాన వర్గానికి చెందిన ఓట్ బ్యాంక్ పవన్ కు మద్దతుగా ఉందని..ఆ ఓటింగ్ తమ వైపు మళ్లుతుందని టీడీపీ అంచనా వేస్తోంది. కానీ, తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో కాపుల్లోని కొందరు టీడీపీతో పవన్ పొత్తును ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు.
ఎవరిపైన ప్రభావం : తాజాగా మాజీ ఎంపీ హరిరామ జోగయ్య రాసిన లేఖ రాజకీయంగా కలకలం రేపుతోంది. గతంలో పవన్ తో కలిసి పని చేసిన పలువురు కాపు నేతలు సైతం జనసేన కాదని బయటకు వచ్చారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ పార్టీ ప్రకటిస్తే వారు సహకరించే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ, టీడీపీ-జనసేనను వ్యతిరేకించే వారికి లక్ష్మీనారాయణ పార్టీ వేదికగా నిలుస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, లక్ష్మీనారాయణ తన పార్టీ ప్రకటనతో పాటుగా లక్ష్యాలు..ఎవరెవరు పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తున్నారనేది స్పష్టత వచ్చిన తరువాత ఆ పార్టీ ఏపీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంచనాల పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications