
చంద్రబాబు బస చేసిన గెస్ట్ హౌస్ కు పవర్ కట్ .. మేము షాకులిస్తామన్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆయనకు ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అడుగడుగునా అవాంతరాలు కల్పించడంపై టిడిపి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జమిలి ఎన్నికలు వస్తే వైసీపీని ఇంటికి పంపిస్తాం..చక్రవడ్డీతో సహా బదులిస్తాం:చంద్రబాబు

చంద్రబాబు బస చేసిన గెస్ట్ హౌస్ కు కావాలనే కరెంట్ కట్ చేశారని ఆరోపణ
మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి చంద్రబాబు బస చేసిన ఆర్అండ్ బి అతిథి గృహానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అమర్ నాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బస చేసిన గెస్ట్ హౌస్ కు కావాలనే కరెంట్ కట్ చేశారని , కనీసం జనరేటర్ సదుపాయం కూడా ఇవ్వలేదని, ఖచ్చితంగా భవిష్యత్తులో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు .

చంద్రబాబు పర్యటనను అడ్డుకోవటానికి అడుగడుగునా అవాంతరాలు అని మండిపాటు
రాబోయే రోజుల్లో తాము కూడా షాకులు ఇస్తామని జగన్ సర్కార్ ను అమర్ నాథ్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి అడుగడుగున అవాంతరాలు సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పం నియోజకవర్గంలో ఓటమి పాలవడంతో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో మూడు రోజులపాటు పర్యటిస్తున్నారు. నిన్నటి నుండి కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక టీడీపీ నేతలు సైతం ఎదురు దాడికి దిగుతున్నారు .

చక్రవడ్డీతో తిరిగి ఇస్తామని సీరియస్ వార్నింగ్
కుప్పంలో ఓటమి తర్వాత పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని తగ్గించడం కోసం, వారికి తాను అండగా ఉన్నారన్న విషయం చెప్పడం కోసం, అలాగే కుప్పంలో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడం కోసం చంద్రబాబు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. నిన్నటికి నిన్న పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు కచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చక్రవడ్డీ తో సహా చెల్లిస్తామని వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.

కొనసాగుతున్న రెండో రోజు చంద్రబాబు పర్యటన
వైసిపి నాయకులు ,పోలీసులు తమ పార్టీ కార్యకర్తలు, నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్న చంద్రబాబు, తప్పుడు కేసులు బనాయించారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంతకంతో కేసులన్నింటినీ రద్దు చేస్తామని చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ పరిపాలనను, వైసీపీ నేతల తీరును అడుగడుగున ఎండగడుతూ చంద్రబాబు పర్యటన రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో సాగుతోంది.