సీఎం జగన్ పిచ్చి చర్యలకు టీడీపీ భయపడదు.. వైఎస్ వల్లే కాలేదు.. దేవినేని ఉమ ఫైర్
టీడీపీ వేటు పడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ యూటర్న్ తీసుకోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య తీవ్ర మాటల యుద్దం కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంతోపాటు బహిరంగ సవాళ్లకు దిగుతున్నారు. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలను భౌతికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టి, లొంగదీసుకునేందుకు కుట్రలు పన్నుతున్నాడని ఆయన ఫైర్ అయ్యారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..

చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తగ్గించేందుకు సీఎం కుట్ర
సీఎం జగన్మోహన్రెడ్డి పార్టీ ఎమ్మెల్యేల చేరికపై అసెంబ్లీలో శ్రీరంగ నీతులు చెప్పాడని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎట్టిపరిస్థితుల్లో చేర్చుకోమని చెప్పిన జగన్, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తగ్గించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఆయన ప్రతిపక్ష హోదా తగ్గించడం వల్ల కేవలం గన్మెన్లు తగ్గుతారు తప్ప ఒరిగేదేమి లేదని అన్నారు. ముఖ్యమంత్రి సీఎం జగన్ పిచ్చి చర్యలకు టీడీపీ భయపడదని అన్నారు.

ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోనే దమ్ము వైసీపీ ఎమ్మెల్యేలకు లేదా...?
ఇక టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడంపై ఆయన మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను , పార్టీ నేతలను తిట్టేందుకు వైసీపిలో ఎమ్మెల్యేలకు దమ్ములేదా అంటూ ప్రశ్నించారు. ప్రజలు 150 మంది ఎమ్మెల్యేలను వైసీపీలో గెలిపిస్తే....అందులో ఎవరికి... సరుకు, చేవ లేవా అంటూ ధ్వజమెత్తారు. వారికి దమ్ము లేకనే టీడీపీ నేతలను భయపెట్టి, కేసులు పెట్టి, లొంగదీసుకునే ప్రక్రియకు సీఎం జగన్ కుట్ర లేపారని అన్నారు. అధికారాన్ని అడ్డం పట్టుకుని సీఎం జగన్ ఎగిరేగిరి పడుతున్నారని అన్నారు.

చంద్రబాబు సన్నిహితుల పేర్లు అడుగుతున్నారు
మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా ఉంటున్న వారిని బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఉమా ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్లే వారి పేర్లను చెప్పాలంటూ ఒత్తిడి తెస్తూ నీచరాజకీయాలకు తెరతీస్తున్నాడని ధ్వజమెత్తాడు. ఇదంతా సీఎం జగన్ మోహన్ రెడ్డి కనుసన్నుల్లో కొనసాగుతుందని, ప్రతి మాట ఆయన చెప్పినట్టుగానే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు..

ఇసుక కొరతను ప్రశ్నించినందుకే ఎమ్మెల్యేల టార్గెట్
అధికార పార్టీ చేస్తున్న ఆగడాలను అడ్డుకుంటున్నందుకే టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను ప్రశ్నించినందుకే సీఎం జగన్ ఇలాంటి కుట్రలకు తెరలేపాడని ఆయన ఆరోపించాడు. ఇది సీఎం జగన్ పైశాచిక అనందానికి పరాకాష్ట చర్యగా ఆయన అభివర్ణించారు. టీడీపీ ఎమ్మెల్యేలను భౌతికంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేయాలని పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నారని అన్నారు. సీఎం పద్దతి మార్చుకోని పరిపాలన సక్రమంగా చేయాలని కోరారు.

వైఎస్ వల్లే కాలేదు.
మత విశ్వాసాలను కనీసం గౌరవించకుండా అయ్యప్ప మాల వేసుకున్న వారితో టీడీపీని తిట్టిస్తున్నాడని దేవినేని ఉమ అన్నారు. పార్టీని లేకుండా చేస్తానని చెప్పిన వైఎస్ రాజశేఖర్రెడ్డి వల్లే కాలేదని , ఇప్పుడు నీవల్ల ఏమి అవుతుందని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ఎలాంటీ ఢోకా లేదని అన్నారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీకి నష్టం ఉండదని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటిప్పుడు నిలదీస్తామని అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!