వివేకా హత్యపై డీఎల్ సంచలన వ్యాఖ్యలు- త్వరలో దోషుల అరెస్ట్- ఎంతటివారికైనా శిక్ష తప్పదు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యపై ఇప్పటికే పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న ఆయన.. ఇవాళ మరోసారి అదే స్ధాయిలో విమర్శలు చేశారు.
మాజీ మంత్రి వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు పకడ్బందీగా జరుగుతోందని డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. కేసుతో ప్రమేయం ఉన్న ఎంతటివారైనా కచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. హత్యలో నిందితులను రక్షించడానికి వివేకా కుమార్తె సునీతా, అల్లుడు రాజశేఖర్ కు హత్యతో ప్రమేయం ఉందని సాక్షిలో కథనాలు రావడం బాధాకరమని డీఎల్ తెలిపారు. వివేకా పీఏ కృష్ణా రెడ్డి ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి చెప్పినట్లు చేశాడని డీఎల్ ఆరోపించారు. పీఏ కృష్ణారెడ్డిపై నమ్మకం పోవడంతో అతనిపై కూడా సునీత ఫిర్యాదు చేశారని డీఎల్ గుర్తుచేశారు.

వివేకా హత్యకు సుపారీ ఎవరు ఇచ్చారు అన్న కోణం లో సీబీఐ విచారణ వేగవంతం చేసిందని డీఎల్ రవీంద్రారెడ్డి వెల్లడించారు. దోషులుగా ఉన్నవారు కచ్చితంగా అరెస్ట్ అవుతారని డీఎల్ తెలిపారు. సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందని డీఎల్ కితాబిచ్చారు. ఈ హై ప్రొఫైల్ కేసులో ఎవరి ఒత్తిళ్లకు లోను కాకుండా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కేసులో త్వరలో దోషుల అరెస్టుతో పాటు మరికొన్నికీలక పరిణామాలు ఉంటాయని డీఎల్ చెప్పారు. వివేకా కేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అనుమానిస్తున్నట్లు తేలింది. ఇప్పుడు ఈ కేసులో ఎంతటివారినైనా సీబీఐ వదిలిపెట్టడంటూ డీఎల్ వ్యాఖ్యానించడంతో అది అవినాష్ రెడ్డి గురించేనా అన్న చర్చ జరుగుతోంది.