ఓట్లేసిన వాళ్లకే జగన్ అన్నీ- పవన్ డబ్బులకు లొంగడు- పోలవరం డ్యామ్ కష్టమే- ఉండవల్లి కామెంట్స్
ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలతో పాటు దేశవ్యాప్తంగా బీజేపీ దూకుడుపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ఒకప్పుడు కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులుగా పనిచేసిన వారు కూడా సిద్ధాంతాలు వదిలిపెట్టి అధికారం కోసం బీజేపీలో చేరిపోవడాన్ని ఉండవల్లి తప్పుబట్టారు.ఏపీలో వైసీపీ సర్కార్ తమకు ఓట్లేసిన వాళ్లకే అన్నీ చేస్తూ మిగతా వాళ్లని వదిలేస్తుందన్నారు.

ఓట్లేసిన వారికే అన్నీ ఇస్తున్న జగన్
ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. ఓట్లేసిన వాళ్లకే అన్నీ ఇస్తున్నారని, ఓటేయని వారికి ఏమీ ఇవ్వకుండా పక్కనబెట్టేసే పరిస్ధితి ఉందన్నారు. వైసీపీతో పాటు టీడీపీ, జనసేన కూడా పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయని,కానీ ఉమ్మడి ప్రత్యర్ధి అయిన బీజేపీని మాత్రం పల్లెత్తుమాట అనడం లేదన్నారు.
బీజేపీపై ఈ రెండు పార్టీలు నోరెత్తవన్నారు. ఎందుకు బీజేపీపై రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు మాట్లాడవని ప్రశ్నించారు. బీజేపీకి అనుకూలమా, వ్యతిరేకమా వీరిద్దరూ చెప్పాలన్నారు. జగన్ పూజలెందుకు చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నించగలరా అని ఉండవల్లి అడిగారు.

పవన్ డబ్పులకు లొంగడన్న ఉండవల్లి
చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు వస్తున్న విమర్శలపై ఉండవల్లి స్పందించారు.పవన్ కళ్యాణ్ డబ్పులకు లొంగేరకం కాదని తాను భావిస్తున్నట్లు ఉండవల్లి తెలిపారు. ఆయనో డిఫరెంట్ మ్యాన్ అని విశ్లేషించారు. ఏదో ఒక్క కులం ఓట్లతో మాత్రం పవన్ కళ్యాణ్ నెగ్గే అవకాశం లేదన్నారు. గతంలో చిరంజీవి గెలుస్తాడనే నమ్మకం ఉన్నందునే 18 శాతం ఓట్లు వచ్చాయని, గత ఎన్నికల్లో పవన్ పై అలాంటి అంచనా లేకపోవడం వల్లే తక్కువ ఓట్లు వచ్చాయన్నారు.

కమ్మ, రెడ్ల పాలనపై
గతంలో ఉమ్మడి ఏపీలో కమ్మ, రెడ్ల గురించి అంత చర్చ ఉండేది కాదని, కానీ 2014 తర్వాత మాత్రం వీరిద్దరి మధ్య స్పష్టమైన విభజన, విభేదాలు కనిపిస్తున్నాయని ఉండవల్లి తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పద్మశ్రీ, పద్మభూషణ్ లు కూడా కమ్మవారికే వచ్చాయని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనూ అంతా రెడ్ల హవా కనిపిస్తోందన్నారు.తద్వారా ఎవరి ప్రభుత్వం ఉంటే వారికే న్యాయం జరుగుతుందన్న భావన ఉందన్నారు.

పోలవరం డ్యామ్ కష్టమే
పోలవరం రిజర్వాయర్ కట్టే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. 30 వేల కోట్ల పరిహారం నిరాశ్రయులకు ఇచ్చే అవకాశం కూడా లేదన్నారు. తన అంచనా వ్రకారం కేంద్రం కనీసం పోలవరం బ్యారేజ్ అయినా కడతారని అనుకుంటున్నట్లు ఉండవల్లి తెలిపారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనని కొత్తమంత్రి కరెక్ట్ గా చెప్పారని ఉండవల్లి ప్రశంసించారు. అది మాత్రం నిజమేనన్నారు. అబద్ధం చెప్పకుండా ఆయన నిజం చెప్పారన్నారు.

విద్వేష బీజేపీలో చేరికలా?
ప్రస్తుతం దేశంలో ఎవరూ ఊహించని విధంగా పరిణామాలు మారుతున్నాయని ఉండవల్లి తెలిపారు. మతం పేరుతో దేశమంతా జరుగుతోంది చూస్తుంటే ఎటుపోతున్నామో అర్ధం కావడం లేదన్నారు. మన బేసిక్స్ ఏంటి, మన వేదాలు, ఉపనిషత్తులు చెప్పిన సనాతన ధర్మమిదేనా అన్న ఆందోళన కలుగుతోందన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చూస్తుంటే గతంలో ఎప్పుడూ ఇలా లేదన్నారు.
పాకిస్తాన్ విడిపోయినప్పుడూ ఇలా లేదని గుర్తు చేశారు. ముఖ్యంగా చదుపుకున్నవాళ్లు, ఐఏఎస్ లు, రిటైర్డ్ జడ్డీలు ఇలా ఎలా ఆలోచిస్తున్నారో అర్ధం కావడంలేదని ఉండవల్లి తెలిపారు.బీజేపీని కూడా తప్పుబట్టబోనన్నారు. వాళ్లేదీ దాచుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అలా విద్వేషాలు నింపుతున్న బీజేపీలోకి సిద్ధాంతాల్ని కూడా పక్కనబెట్టి మాజీ కాంగ్రెస్ వాదులు చేరడం దారుణమని ఉండవల్లి ఆక్షేపించారు.