ఉండవల్లి షాకింగ్ - జిన్నా తాత హిందువే- జగన్, చంద్రబాబుది జైలుభయం-తిరుపతి ఎన్నిక నేపథ్యం
ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో చోటు చేసుకుంటున్న రాజకీయాలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తనదైన శైలిలో పార్టీలకు చురకలు అంటించారు. ఈ క్రమంలో బీజేపీకి మద్దతిస్తున్న జగన్, చంద్రబాబుపైనా ఆయన సెటైర్లు వేశారు. సిద్ధాంతపరంగా బీజేపీని తాను వ్యతిరేకిస్తానని, కానీ కేసుల కోసం జగన్, చంద్రబాబు ఆ పార్టీకి మద్దతివ్వడం సరికాదన్నారు. బీజేపీకి ఏపీలో ప్రజల మద్దతు లేదన్నారు. మరోవైపు పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా హిందువే అంటూ మరో కొత్త వివాదానికి ఉండవల్లి తెరలేపారు. రాజమండ్రిలో ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

రామతీర్ధం టూ తిరుపతి పాలిటిక్స్
విజయనగరం జిల్లా రామతీర్ధం ఆలయంలో తాజాగా చోటు చేసుకున్న ఘటనపై స్పందించాల్సింది రాజకీయ పార్టీలు కాదని పోలీసులు మాత్రమేనని మాజీ ఎంపీ ఉండవల్లి తెలిపారు. భారత దేశంలో పోలీసులకు ఎక్కడ లేని హక్కులు ఉంటాయని, వారిని కాసేపు వదిలేస్తే వారి పని వారు పూర్తి చేస్తారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. పోలీసులకే వదిలేస్తే సులువుగా రామతీర్ధం ఘటన కారకుల్ని పట్టుకుంటారని ఉండవల్లి తెలిపారు. వాస్తవానికి ప్రపంచంలోని అన్ని మిలటరీలను రంగంలోకి దింపినా మన గుళ్లకు కాపలాకు సరిపోదని ఉండవల్లి చమత్కరించారు. కానీ అధికారంలో ఉన్న వైసీపీ నేతలు చంద్రబాబు కంటే ముందు రామతీర్ధానికి ఎందుకు పరుగులు తీశారో తెలియలేదన్నారు. ఇదే అధనుగా భగవద్గీతకు ఓటేస్తారా, బైబిల్‌కు ఓటేస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారని ఉండవల్లి ఆక్షేపించారు.

జిన్నా నేపథ్యంపై ఉండవల్లి షాకింగ్
పరమత సహనం గురించి మాట్లాడుతూ గతంలో పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా వంశంలో ఏం జరిగిందో ఉండవల్లి పూసగుచ్చినట్లు వివరించారు. జిన్నా తాత ప్రేమ్‌జీ భాయ్ ఠక్కర్ ఓ రాజ్పుట్ అని ఆయన శాకాహారి అని ఉండవల్లి తెలిపారు. ఆయన మాత్రం చేపల వ్యాపారం చేసేవాడన్నారు. ఆయన కుమారుడి కుటుంబం మాత్రం ఆయన్ను వదిలిపెట్టి ఇస్లాంలోకి మతం మారిందన్నారు. అప్పటి నుంచి జిన్నా తాతను కూడా దూరంగా పెట్టారని, అది తట్టుకోలేక ఆయన చనిపోయారని ఉండవల్లి వెల్లడించారు. జిన్నా పూర్వీకులు తాము రాముడి వంశం అని చెప్పుకుంటారని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన జిన్నా భారత్-పాక్ విభజనకు కారణం కావడం భిన్నత్వంలో ఏకత్వమేమో అని ఉండవల్లి చమత్కరించారు

జగన్, చంద్రబాబుది జైలు భయం
రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్, విపక్షంలో ఉన్న చంద్రబాబు పోటీ పడి బీజేపీకి మద్దతిస్తున్నారని ఉండవల్లి అన్నారు. ఓట్ల పరంగా చూస్తే 95 శాతం ఓట్లు కలిగిన పార్టీలు బీజేపీకి మద్దతిస్తున్నాయని, కానీ ప్రజలు మాత్రం బీజేపీకి మద్దతివ్వడం లేదన్నారు. తిరుపతి ఉపఎన్నిక కోసం బీజేపీ చేస్తున్న రాజకీయం సరికాదని ఉండవల్లి తెలిపారు. బీజేపీకి ఇక్కడి ప్రజల మద్దతు లేదని చంద్రబాబు, జగన్ గుర్తించాలని ఉండవల్లి తెలిపారు. కేవలం జైల్లో పెడతారనే భయంతోనే జగన్, చంద్రబాబు బీజేపీకి మద్దతిస్తున్నాని ఉండవల్లి విమర్శించారు. జగన్, చంద్రబాబుకు సిద్ధాంతాలు లేకపోయినా బీజేపీకి మాత్రం సిద్ధాంతాలున్నాయన్నారు. వాటిని తాను వ్యతిరేకిస్తానని ఉండవల్లి తెలిపారు.

వాజ్‌పేయ్, అద్వానీని బీజేపీ తరిమేసింది ఇందుకే...
మతం కారణంగా ప్రపంచదేశాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న క్రైస్తవులు, ముస్లింలకు మనం వ్యతిరేకం కావాల్సి వస్తే అందుకు బీజేపీయే కారమవుతుందని ఉండవల్లి పేర్కొన్నారు. బీజేపీని సమర్ధిస్తున్న వైసీపీ, టీడీపీ వంటి పార్టీలు కూడా కారణమవుతాయన్నారు.
వాజ్‌పేయ్ కెరీర్ చరమాంకంలో మతాలు, వాదనలు అన్నీ వదిలేయాలనిపిస్తోందని అన్నారని, ఆ తర్వాత బీజేపీ నేతలు ఆయన్ను వదిలేశారని ఉండవల్లి చెప్పారు. అద్వానీ ఎప్పుడైతే పాకిస్తాన్ వెళ్లి జిన్నాను పొగిడాడో అప్పుడు ఆయన్ను వదిలేసి మోడీని తీసుకొచ్చారన్నారు.

అగ్రకులాలు చేసింది తప్పేనన్న ఉండవల్లి
దేశంలో బలహీన వర్గాలు మతమార్పిళ్ల ద్వారా క్రైస్తవంలోకి వెళ్లడానికి కారణమైన అగ్రకులాలు చేసింది తప్పేనని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. అప్పట్లో అలా జరగడానికి కారకులైన అగ్రకులాల ధోరణి సరికాదనేది తన అభిప్రాయమన్నారు. అగ్రకులాల ధోరణి వల్ల వారు దూరంగా ఉంచిన కులాల వారు క్రైస్తవాన్ని, ఇస్లాంను ఆశ్రయించాల్సి రావడం అప్పటి పరిస్ధితుల ఆధారంగా జరిగిందన్నారు. అగ్రకులాలకు చెందిన వారు ఆ భావాన్ని లోలోపల పొగొట్టుకోలేకపోతున్నారని ఉండవల్లి తెలిపారు. ఆ భావన పొగొట్టుకున్న నాడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.