రాజ్యసభ: ఏపీ నుంచి అదానీ స్థానంలో బీజేపీ నేత?
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఒకటి అదానీకి కేటాయిస్తున్నారని, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఎంపికవుతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. అయితే అదానీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభకు ఎంపికవ్వాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని నామినేషన్ వేయాల్సి ఉండటంతో పార్టీల తరఫున ఎంపికవడం ఇష్టంలేని అదానీ వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ సీటును భారతీయ జనతాపార్టీ కోటాకు కేటాయించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో తెలుగుదేశం, బీజేపీ మధ్య పొత్తు ఉన్న సమయంలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఏపీ నుంచి ఎంపికయ్యారు. ఆయన పదవీకాలం పూర్తవుతోంది. అయితే భారతీయ జనతాపార్టీ పెద్దలు ఎవరిపేరును సూచిస్తారో వారికి కేటాయించాని యోచిస్తున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఒక సీటును రియలన్స్ తరఫున అంబానీ స్నేహితుడు పరిమళ్ నత్వానీకి ఇచ్చారు. ఆయన వైసీపీ సభ్యత్వం తీసుకొని ఆ పార్టీ తరఫునే రాజ్యసభకు ఎంపికయ్యారు. అలా ఎంపికవడం ఇష్టం లేకనే అదానీ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.

త్వరలో జరగనున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీ నుంచి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఖరారైనట్లుగా ప్రచారం నడుస్తోంది. విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపించనున్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావును ఎంపిక చేయనున్నారని, నాలుగో అభ్యర్థి కూడా ఖరారవగానే అందరి పేర్లను పార్టీ ప్రకటిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.