వాళ్లు 75 ఏళ్ల కుర్రాళ్లు.. వాళ్ల స్పీడ్ తట్టుకోవడం ఎవరి వల్లా కాదు
పుట్టపర్తిలో ఏర్పాటయ్యే ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ - AMCA) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ శంకుస్థాపన ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను మార్చబోతుంది. డిఫెన్స్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి పవిత్ర భూమి ఈరోజు భారతదేశ రక్షణరంగ కొత్త శక్తి కేంద్రంగా మారుతోంది.
యువగళం పాదయాత్ర నుంచి చూస్తున్నాను. ఉమ్మడి అనంతపురం జోషే వేరు, ఈ జోష్ ఎప్పుడు అదిరిపోతుంది. ఉమ్మడి అనంతపురం, గత ఎన్నికల్లో ఎన్‌డీఏకి కంచుకోట. 14 ఆఫ్ 14 సీట్లు క్లీన్ స్వీప్ చేశారు. అందుకే ఇప్పుడు మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాము. అప్పుడు కియా, ఇప్పుడు ఫైటర్ జెట్స్. కరువు నేలపై కార్లు పరిగెత్తించిన మన విజనరీ ముఖ్యమంత్రి సీబీఎన్. ఇప్పుడు అదే పుణ్యభూమిపై ఫైటర్ జెట్స్ ఎగిరేలా చేస్తున్నది కూడా మన ముఖ్యమంత్రి సీబీఎన్ గారే. ఈ నేలకు భగవాన్ సత్యసాయి బాబా గారి ఆశీస్సులు ఉన్నాయి. ఎవరూ ఉహించని సమయంలో ఆయన ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మించారు. ఇప్పుడు ఆయన అనుగ్రహంతో ఫైటర్ జెట్స్ తయారు చేసే పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయి.

వాళ్ల ముగ్గురు 75ఏళ్ల కుర్రాళ్లు
ఆపరేషన్ సిందూర్‌కు ఒక సంవత్సరం పూర్తి అయింది. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు పాకిస్తాన్‌కు గట్టి జవాబు ఇచ్చిన ఘటన అది... దానికి ప్రతి భారతీయుడికి గర్వపడాలి. ఆపరేషన్ సిందూర్ వెనుక అతిపెద్ద శక్తి, మన ఐరన్ మ్యాన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారే. దేశంలోని అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రమే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. దేశం అంతా నమో అంటే నరేంద్ర మోదీజీ. ఏపీలో నమో అంటే నాయుడు జీ - మోదీ జీ . ఇది ఒక పవర్‌ఫుల్ కాంబినేషన్. మోదీజీ, రాజ్ నాథ్ సింగ్ జీ, మన నాయుడు గారికి ఒక కామన్ థింగ్ ఉంది. వీరంతా 75 ఏళ్ల కుర్రాళ్ళు. వాళ్ల స్పీడ్ చూస్తే నాకు డౌట్ వస్తుంది. వాళ్లలోని ప్రతి ఒక్కరిలో ఒక 25 ఏళ్ల కుర్రాడు ఉన్నారని. ఈ ముగ్గురి స్పీడ్ తట్టుకోవడం ఎవరి వల్లా కాదు.
నమో జోడి వల్లే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు
గూగుల్ డేటా సెంటర్ రూ. 1.35 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్. ఆర్సెలార్ మిట్టల్ రూ. 1.35 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు పుట్టపర్తిలో ఫైటర్ జెట్స్ లక్ష కోట్ల పెట్టుబడులు. అమరావతి, పోలవరానికి నిధులు. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాము. విశాఖ రైల్వే జోన్ తెచ్చుకున్నాం. త్వరలో కర్నూలకు హైకోర్టు బెంచ్ రాబోతోంది. ఇవన్నీ సాధించుకున్నామంటే అది నమో జోడి (నాయుడు, మోడీజీ) వల్లే. 23 నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో దేశానికి చూపించాం. ఆంధ్రప్రదేశ్‌ని ఇన్వెస్ట్‌మెంట్స్ డెస్టినీగా మార్చాం. ఇతర రాష్ట్రాల అభివృద్ధి చూసి మనం అసూయ పడే రోజులు పోయాయి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు మన అభివృద్ధి చూసి అసూయ పడే రోజులు వచ్చాయి.
ఏఎంసీఏతో యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు
జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్, పుట్టపర్తిలో ఏఎంసీఏ, డిఫెన్స్ ఆర్ అండ్ డి ఆర్గనైజేషన్ (DRDO), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ కలిసి AMCA ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నాయి. హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (HAL) దశాబ్దాలుగా బెంగళూరును అభివృద్ధి చేసింది. అదే తరహాలో AMCA పుట్టపర్తిని అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ 5వ తరం స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ జెట్స్ తయారు చేస్తారు. భారత్ ఫోర్జ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోసివ్స్ లిమిటెడ్‌తో పాటు అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. దీనివల్ల ఈ ప్రాంత యువతకు పెద్దఎత్తున ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా మనం డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తాం. ఒక్క కియాతో ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏఎంసీఏతో ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిలో నెంబర్ 1 కావడం ఖాయం.
ఈ ప్రాజెక్టు కోసం చంద్రబాబు ప్రత్యేక కృషి
ప్రతి పెద్ద ప్రాజెక్ట్ వెనుక ఒక కథ ఉంటుంది. ఏఎంసీఏ కథ కూడా 2025లో మొదలైంది. 5 ఫిబ్రవరి 2025న ఢిల్లీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారిని కలిశాను. ఆరోజు ఆంధ్రప్రదేశ్ విజన్ వాళ్ల ముందు పెట్టాను. AMCA ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వమని అభ్యర్థించాను. ఆ తర్వాత మన సర్కార్ ఈ మిషన్‌పై నిరంతరం పనిచేస్తూనే ఉంది. మన పరిశ్రమల మంత్రి టీ .జీ. భరత్ కూడా ఈ మిషన్‌ని నిరంతరం ముందుకు తీసుకెళ్లారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా కృషిచేశారు. ఆ ప్రయత్నాల ఫలితంగానే ఇవాళ పుట్టపర్తి భారత డిఫెన్స్ మ్యాప్‌పై కొత్త గుర్తింపు పొందుతోంది. లక్ష కోట్ల కంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్, వేలాది యువతకు ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఇది కేవలం ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ కాదు...ఇది రాయలసీమ భవిష్యత్తుకు కొత్త దిశ ఇచ్చే ప్రాజెక్ట్. ఇవాళ పుట్టపర్తి కేవలం ఒక ఆధ్యాత్మిక నగరం కాదు... భారత రక్షణరంగ భవిష్యత్తు కేంద్రంగా మారుతోంది.
ప్రధాని మోడీజీ, రాజ్ నాథ్ లకు ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్‌కు ఇంత మహత్తరమైన రక్షణ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జీ లకు హృదయ పూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మేము హామీ ఇస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ 2047 నిర్మాణంలో బలమైన భాగస్వామ్యం అందిస్తుంది. ఇంత దూరం వచ్చి పంచ్ లేకపోతే ఎలా... మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. వాళ్లది ఫాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ - మనది ఫైటర్ జెట్ బ్యాక్‌గ్రౌండ్. వాళ్లది కిడ్నాప్ బ్యాక్‌గ్రౌండ్ - మనది కియా బ్యాక్‌గ్రౌండ్. రెండిటికీ చాలా తేడా ఉంది - అర్థమైందా రాజా... అంటూ యువనేత లోకేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు.














Click it and Unblock the Notifications