హైదరాబాద్: ప్రముఖ నటులు మహేష్ బాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లపై తెలుగుదేశం పార్టీ ఎంపీ, మహేష్ బావ గల్లా జయదేవ్ ఓ ప్రముఖ తెలుగు మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ మిత్రుడే, కానీ! మహేష్‌కు ఆ ఆలోచన లేదు: గల్లా జయదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తన సోదరి డాక్టర్ రమాదేవితో కలిసి జయదేవ్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన తెలుగు భాషా సామర్థ్యం గుంటూరు ప్రజలను అడిగితే తెలుస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా గల్లా జయదేవ్ చెప్పారు.

పవన్ వ్యాఖ్యాలపై జయదేవ్ ఇలా..
కొందరు ఎంపీలు ఓ వైపు పదవిని అనుభవిస్తూనే మరోవైపు వ్యాపారాలు
చేసుకుంటున్నారని, పోలవరంతో పాటు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జయదేవ్ స్పందించారు. కొంతమంది వ్యాపారం చేసి ప్రజా ప్రతినిధులు అవుతుంటారని, మరికొందరు ప్రజా ప్రతినిధులుగా మారిన తర్వాత వ్యాపారాలు చేస్తుంటారని, రెండింటికీ తేడా లేదని అన్నారు.

చేతులు కట్టేసి పోరాడమంటే ఎలా..
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తాము పార్లమెంట్‌లో వెల్‌లోకి వెళ్లామని, నినాదాలు చేశామని, ప్లకార్డులు చూపామని గల్లా జయదేవ్ గుర్తు చేశారు. తమను వదిలేస్తే పోరాడతామని, చేతులు కట్టేసి పోరాటం చేయమంటే ఎలా చేయగలమని సంచలన వ్యాఖ్యానించారు.

వాస్తవం లేని ప్రచారం
ఎంపీగా జయదేవ్ ప్రజలకు అందుబాటులో ఉండడని వస్తున్న విమర్శలపైనా స్పందిస్తూ.. అవన్నీ అసంతృప్తులు చేస్తున్న ప్రచారమేనని కొట్టిపారేశారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తనకు తెలుసునని అన్నారు. 2019 ఎన్నికల్లో విజ్ఞాన్ రత్తయ్య కుమారుడు తనకు పోటీగా దిగుతాడని భావిస్తున్నానని, గెలుపుకోసం శాయశక్తులా పోరాడతానని చెప్పారు.

చిరంజీవి రాజీనామా తర్వాత ప్రయత్నం విఫలం
2012 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన చిరంజీవి, రాజ్యసభకు వెళ్లిన తరువాత కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి తాను విఫలమయ్యానని చెప్పారు. ఆ తర్వాత సరైన పార్టీలో సరైన చోటు నుంచి స్థానాన్ని కోరుకుని తెలుగుదేశంలో చేరానని గల్లా జయదేవ్ తెలిపారు.

కష్టమైనా మహేష్‌ను పిలవను
2019 ఎన్నికల్లో తన గెలుపు కష్టసాధ్యంగా ఉన్నా సరే మహేష్ బాబును ప్రచారానికి రమ్మని పిలవబోనని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ప్రచారం కోసం మహేష్‌పై ఒత్తిడి చేయబోనని చెప్పారు. గత ఎన్నికల్లో మహేష్ రాకుండానే గెలిచానని, అదే మంచిదని తెలిపారు. గతంలో ఓసారి జయదేవ్ మాట్లాడుతూ.. మహేష్‌కు రాజకీయాలు సరిపడవని, ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!