రాజధాని లేదని అవమానిస్తారా?: ప్రధాని మోడీకి కూడా అంటూ లోక్సభలో గల్లా జయదేవ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఇండియా మ్యాప్ విడుదల చేయడంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు.

అమరావతి లేకుండా ఏపీ చిత్రపటం
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం జీరో అవర్లో ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడారు. ఇటీవల కేంద్ర హోంశాఖ ఇండియా మ్యాప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మిగతా రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లను పేర్కొనగా.. ఏపీ రాజధాని అమరావతి పేరును మాత్రం ప్రస్తావించలేదు.

ఏపీ ప్రజలనే కాదు.. ప్రధానిని అవమానించినట్లే..
ఈ విషయంపై లోక్సభలో ఆగ్రహం వ్యక్తం చేసిన గల్లా జయదేవ్.. అమరావతికి చోటు కల్పించకపోవడం ఏపీ ప్రజానీకాన్ని అవమానించడమేనని అన్నారు. అంతేగాక, అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీని కూడా కేంద్రం ఈ చర్య ద్వారా అవమానించిందని అన్నారు.
తప్పు సరిదిద్దండి..
రాజధాని లేకుండా విడుదలైన ఈ చిత్రం నూతన రాష్ట్రంలో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. కేంద్రం తక్షణం ఈ తప్పును సరిదిద్ది కొత్త చిత్రపటం విడుదల చేయాలని జయదేవ్ కోరారు.

రాజధాని శంకుస్థాపనకు ప్రధాని..
అమరావతి నిర్మాణం ఆలస్యం అవుతుండటంపై జీరో అవర్లో చర్చించాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ నోటీసు ఇచ్చారు. ఇందులో భాగంగా రాజధానిపై చర్చ జరిగింది. అమరావతి రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి సీఎం చంద్రబాబు అందరికీ అందుబాటులో ఉంటుందని అమరావతిని రాజధాని నిర్ణయించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!