విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ:ఏవోబీలో గంజాయి జోరు...దాడులకు వెనుకాడుతున్న ఎక్సైజ్, పోలీసుశాఖలు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం:ఏవోబీ...ఇది ఇప్పుడు మావోయిస్టులకే కాకుండా గంజాయి సాగుకు, గంజాయి స్మగర్లకు షెల్టర్ జోన్‌గా మారింది. గతంలో ఏజెన్సీలోని పలు మండలాల్లో గంజాయి సాగు జరిగేది.

అయితే వాటిపై పోలీసు,ఎక్సైజ్‌శాఖలు పదేపదే దాడులు చేస్తుండటంతో ఇక గంజాయి బడా వ్యాపారులంతా అక్కడనుంచి మకాం మార్చేసి ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్ (ఏవోబీ)కి తరలివెళ్లారు. ఇది మావోయిస్టులకు బాగా పట్టున్న ప్రాంతం కావడంతో ఒడిశా, విశాఖ జిల్లాకు చెందిన పోలీసు,ఎక్సైజ్‌శాఖలు అక్కడి గంజాయి తోటల సాగు జోలికి పోవడం లేదు. దీంతో గంజాయి స్మగ్లర్లు ఏవోబీలో భారీగా పెట్టుబడులు పెట్టి గంజాయి సాగు చేయిస్తున్నారు.

ప్రస్తుతం ఇక్కడే...గంజాయి సాగు

ప్రస్తుతం ఇక్కడే...గంజాయి సాగు

ఒడిశాసరిహద్దులోనిజీకేవీధి,చింతపల్లి,జి.మాడుగుల,పెదబయలు,ముంచంగిపుట్టు మండలాల పరిధిలోని మారుమూల గ్రామాల్లో ప్రస్తుతం గంజాయి సాగు జోరుగా సాగుతోంది. ఇక్కడ ఒడిశా,ఆంధ్రా భూములనే తేడా లేకుండా నీటి వనరులు అందుబాటులో ఉన్నచోట గంజాయిని ఉధృతంగా సాగుచేస్తున్నారు. పైగా ఇప్పుడు ఏవోబీలో గిరిజనులంతా పూర్తి అధునిక పద్ధతుల్లో గంజాయిని సాగుచేస్తుండటం విశేషం. గంజాయి సాగుకు ఎరువులు,క్రిమిసంహరక మందుల వినియోగం కూడా గతంలో కన్నా బాగా పెరిగింది.

ఎక్కడ చూసినా...గంజాయి వనాలే

ఎక్కడ చూసినా...గంజాయి వనాలే

ఇక్కడ ప్రధానంగా కలుపు, శీలావతి, రాజహంస మరియు తస్లపత్రి వంటి నాలుగు రకాలు సాగు అవుతున్నప్పటికీ వీటిలో శీలావతి రకం గంజాయికి విలువ అధికంగా ఉండడంతో వ్యాపారులంతా దీనినే బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ సుమారు 10వేల ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బలిమెల, సీలేరు రిజర్వాయర్లను ఆనుకుని ఉన్న పరివాహక ప్రాంతాల్లో...మల్కన్‌గిరి కటాఫ్‌ ఏరియాలో ఎక్కడ చూసిన గంజాయి వనాలే దర్శనమిస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దాడులకు...ఎక్సైజ్, పోలీసుల వెనుకంజ

దాడులకు...ఎక్సైజ్, పోలీసుల వెనుకంజ

ఏవోబీలో గంజాయి సాగు అధికంగా ఉందనే సమాచారం ఇరురాష్ట్రాల పోలీసు,ఎక్సైజ్‌ అధికార యంత్రాంగానికి తెలిసినప్పటికీ దాడులకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. అవి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అక్కడికి వెళ్లేందుకు వీరు సాహసించడం లేదు. మరోవైపు ఏవోబీలోని గిరిజనుల్లో ఇప్పుడిప్పుడే పోలీసుల పట్ల వ్యతిరేకత తగ్గి సానుకూలత ఏర్పడుతోంది. ఈ సమయంలో మళ్లీ ఏ పేరుతోనైనా దాడులు చేస్తే గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనలో పోలీసు అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏవోబీలో కూంబింగ్‌ చర్యలు చేపడుతున్న సమయంలో గంజాయి తోటలు కంట పడుతున్నప్పటికీ ఇరు రాష్ట్రాల పోలీసు పార్టీలు పట్టించుకోవడం లేదు. కేవలం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగానే ఈ కూంబింగ్‌లు జరుగుతున్నాయనేది వాస్తవం.

ఏవోబీలో...గంజాయి నిర్మూలన లేదు

ఏవోబీలో...గంజాయి నిర్మూలన లేదు

గడచిన 10 ఏళ్లలో ఏవోబీలో గంజాయి తోటలను నాశనం చేసిన దాఖలాలు లేవని స్థానికులు అంటున్నారు. ఒడిశాలోని యంత్రాంగం కూడా గంజాయి తోటలను చూసిచూడనట్లే వదిలేస్తోంది. అయితే ఎపి ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు నిర్మూలనకు గట్టి చర్యలు చేపట్టింది. గత ఏడాది 288 గ్రామాల పరిధిలో సాగైన 3200 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేసినట్టు ఎక్సైజ్‌ అధికారులు ప్రకటించినా...అందులో ఏవోబీ ప్రాంతంలోని గంజాయి వనాలు లేవంటున్నారు. అక్కడ ప్రస్తుతం గంజాయి వనాలు ఏపుగా పెరుగుతున్నాయని...ఈ ఉచ్చు నుంచి గిరిజనులను బయటకు తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

English summary
Visakhapatnam: AOB...now this is the Shelter Zone for Ganja cultivation and Ganja smugglers rather than the Maoists. Previously Ganja cultivation massive occurrence in several zones of the agency. But the situation is changed now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X