విశాఖలో రాజధాని స్వాగతిస్తా: చంద్రబాబు ఆదేశాలు పాటిస్తా: పార్టీ మార్పుపై గంటా ఇలా..!
మాజీ మంత్రి గంటా కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన నాటి నుండి గంటా పార్టీ మార్తారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటి మీద ఆయన వివరణ ఇచ్చారు. అదే విధంగా విశాఖకు రాజధాని తరలింపు అంశం మీద స్పందిస్తూ విశాఖ వాసిగా రాజధాని అక్కడ ఏర్పాటు చేయటాన్ని స్వాగతిస్తున్నాని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని గంటా స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా విశాఖలో రాజధాని వస్తే శాంతిభద్రతలు లోపిస్తాయన్న భయాందోళనలను ప్రభుత్వం తొలగించాలన్నారు.
పార్టీ మార్పుపై గంటా తేల్చేసారు..
మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు తాను పార్టీ మారే అంశం పైన స్పందించారు. ఎన్నికలు ముగిసి నాటి నుండి తాను పార్టీ మారుతాననే వార్తలు వస్తూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆయన తొలుత వైసీపీలో చేరుతారని..ఆ తరువాత ఢిల్లీకి వెళ్లి బీజేపీ ముఖ్య నేత రాంమాధవ్ ను కలవటంతో ఆయన బీజేపీలో చేరటం ఖాయమనే ప్రచారం సాగింది. అదే విధంగా టీడీపీ నుండి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దూరం కాగా..అదే సమయంలో గంటా సైతం అసెంబ్లీ సమావేశాలకు తొలుత దూరం పాటించారు. ఇక, ఇప్పుడు విశాఖకు రాజధాని తరలింపు ప్రతిపాదనతో గంటాతో సహా మరో ఇద్దరు విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతారంటూ మరో సారి ప్రచారం మొదలైంది. దీని పైన స్పందించిన గంటా తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.

విశాఖ వాసిగా..చంద్రబాబు ఆదేశాలకు
రాజధాని మార్పును టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి రైతులకు మద్దతుగా వారి దీక్షా శిబిరాల వద్దకు వెళ్లి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో దీని పైన గంటా కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖకు చెందిన వ్యక్తిగా విశాఖలో రాజధాని పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని ప్రకటించారు. అయితే రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా విశాఖలో రాజధాని వస్తే శాంతిభద్రతలు లోపిస్తాయన్న భయాందోళనలను ప్రభుత్వం తొలగించాలన్నారు. అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దీని ద్వారా తన మీద అటు పార్టీ నుండి..ఇటు స్థానికంగానూ ఏ రకమైన వ్యతిరేకత లేకుండా గంటా జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తోంది.